హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కేసీఆర్

25 Aug, 2014 02:19 IST|Sakshi

* రెండు దేశాల్లో ఐదురోజులు పర్యటించిన సీఎం  బృందం
* చివరి రోజు మలేసియా ప్రధానితో సమావేశం
* మోనో రైలు, పుత్రజయ, సైబర్ జయ సందర్శన

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో  సింగపూర్, మలేసియాల్లో అయిదురోజుల పాటు పర్యటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బృందం తమ పర్యటనను ముగించుకొని ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. సీఎం బృందం అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటు, ఆయా దేశాల నగరీకరణ, ఐటీ రంగాలతోపాటు పారిశ్రామిక పురోగతిపై అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ మలేసియాలో రెండురోజులపాటు జరిగిన పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్‌తో సమావేశయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తీసుకుని రానున్నట్లు  వివరించారు.
 
  హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలను,  పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల అనుమతులను సింగిల్‌విండో పద్ధతిలో  ఇవ్వనున్నట్లు  తెలిపారు. మలేషియా పర్యటనలో భాగం గా  ప్రముఖ కేంద్రం పుత్రజయను, ఆ తరువాత సైబర్ జయను కేసీఆర్ సందర్శించారు. కౌలాలంపూర్‌లోని మోనోరైలును కూడా  పరిశీలించారు. సంబంధిత అధికారులతో భేటీ అయ్యూరు. తొలుత సీఎం ఈ నెల 20న  ప్రముఖ పారిశ్రామిక కేంద్రం జురాంగా ఇండస్ట్రీయల్ పార్క్‌ను సందర్శించాక, ఆ రాత్రి అక్కడున్న తెలంగాణ వారితో సమావేశమయ్యారు. రెండో రోజున సింగపూర్ పట్టణాభివృద్ధికి సంబంధించి అక్కడి అధికారులతో భేటీ అయ్యూరు.
 
 అక్కడి ప్రభుత్వం శాంతిభద్రతలతోపాటు, అనుసరిస్తున్న విధానాలను అక్కడి ముఖ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోజు ఉదయమే స్థానికంగా ఉన్న ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ఎలా ఉంటుందో వివరించారు. మూడో రోజున ఐఐఎం పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సదస్సుల్లో పాల్గొన్నారు. ఆ దేశ ప్రధానిని  కలిశారు. ఆ దేశ మంత్రులతో కూడా పలు అంశాలపై చర్చలు నిర్వహించారు. 23వ తేదీన సీఎం బృందం కారులో సింగపూర్  నుంచి  మలేసియా వెళ్లారు. సింగపూర్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే సమయంలో పలు పట్టణాల్లో ఆ దేశం పట్టణాభివృద్దికి ఇచ్చిన ప్రాధాన్యతను గమనించారు. 24వ తేదీన ఆదివారం ఆయన చాలా బీజీగా గడిపారు. ఆదివారం రాత్రి అక్కడ నుంచి బయల్దేరి అర్ధరాత్రి సమయంలో  హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. సీఎంతో పాటు ,ఆర్థిక శాఖ వుంత్రి ఈటెల రాజేందర్, కొంతవుంది ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటనలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు