గులాబీలో గుబులు!

26 Apr, 2014 01:27 IST|Sakshi
గులాబీలో గుబులు!

సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: గులాబీ దళంలో సీబీఐ గుబులు నెలకొన్నట్టు సమాచారం.  ఎన్నికల వేళ ఇవేం చిక్కులు అంటూ  కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి సైతం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు హరీష్‌రావు, అలాగే విజయశాంతిపై అక్రమాస్తుల ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని నాంపల్లి సీబీసీ ప్రత్యేక కోర్టు సీబీఐ ఎస్పీని ఆదేశించడంతో మెతుకుసీమలో రాజకీయ  కలకలం రేగుతోంది.

ఇదే జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు(మాజీ టీఆర్‌ఎస్ నేత)  రఘునందన్‌రావు చేసిన ఆరోపణల ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన బాలాజీ వడేరా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ  జరిపి  నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో రాజకీయ విశ్లేషకుల దృష్టి జిల్లా రాజకీయాల మీద పడింది. 2001 తర్వాత కేసీఆర్ ఉద్యమం పేరుతో అక్రమంగా డబ్బు కూడబెట్టారని కోర్టుకు విన్నవించారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌లో ఉన్న విజయశాంతి ఇంట్లోనే రూ. 100 కోట్ల లావాదేవీలు నడిచాయని, ఇదంతా అక్రమంగా వసూలు చేసిన మొత్తం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి పైముగ్గురు నాయకులు కూడా ఇటీవలే ఎన్నికల కమిషన్‌కు తమ ఆస్తుల అఫిడవిట్‌లను సమర్పించారు.

 ఈ ముగ్గురు ఆస్తులు అన్నీ కలిపి కనీసం రూ. 40 కోట్లు కూడా దాటలేదు. కానీ కోర్టు ఏకంగా రూ. 100 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఆదేశించడంతో మిగిలిన ఆస్తులు ఎక్కడ నుంచి బయట పడతాయోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు కారు లేదని చూపించారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవ ల్లి గ్రామంలో 37 ఎకరాల 70 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్టు కేసీఆర్ చూపించారు. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ 4.5 కోట్లు అని పేర్కొన్నారు. దీనితో పాటు సిద్దిపేట మండలం మిట్టపల్లిలో 2 ఎకరాల భూమి ఉందని దీని మార్కెట్ విలువ రూ. 50 లక్షలు ఉంటుందని చెప్పారు. బంజారాహిల్స్‌లో 584 గజాల స్థలం, కరీంనగర్‌లో 1,449 గజాల స్థలం ఉందని వీటి మార్కెట్ విలువ రూ. 8.65 కోట్లు అని చెప్పారు. వీటితో పాటు రూ. 7.88 కోట్లు అప్పులు ఉన్నట్లు కేసీఆర్ చూపించారు. ఆయన భార్య పేరిట 650 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపించారు.

 విజయశాంతి ఆస్తులు:  ఇక విజయశాంతి , ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పేరిట రూ. 29.87 కోట్లు స్థిరాస్తి ఉన్నట్లు చూపించారు. రూ 70.61 లక్షల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అప్పులు ఏమి లేవన్నారు. టయోటా(రూ.5.89 లక్షలు) వాహనం ఉన్నట్లు చూపించారు.

 హరీష్ ఆస్తుల వివరాలు: హరీష్‌రావు తన పేరిట రూ. 1.35 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తి ఉందని, తన భార్య శ్రీనిత పేరిట రూ. 1.60 కోట్ల చరాస్తులు ఉన్నాయని చూపించారు. వాటితో పాటు తన భార్యకు రూ 1.21 కోట్ల అప్పుందని పేర్కొన్నారు. 16 లక్షల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని చూపించారు.

మరిన్ని వార్తలు