ప్రజా బడ్జెట్‌ 

23 Feb, 2019 11:38 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యక్షంగా కేటాయింపులు లేకపోయినా, పరోక్షంగా సంక్షేమ పథకాల రూపంలో జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది. వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిధు ల కేటాయింపుతో ఆయా వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నా యి. నిరుద్యోగ భృతిపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించకపోవడంతో ఆయా వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 2019–20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమంతోపాటు కుల వృత్తులు, ఇతర రంగాలకు సమతూకంగా ప్రాధాన్యం ఇచ్చింది. వరంగల్‌ రూరల్‌ వ్యవసాయాధరిత జిల్లా. అర్బన్‌ జిల్లాలో గ్రేటర్‌ పరిధి కాకుండా మిగతా మండలాల్లో సైతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌లో రైతు బంధు సాయం పెంపు, రైతు బీమాతో అత్యధిక శాతం రైతులు ప్రయోజనం పొందనున్నారు. రూరల్‌ జిల్లాలో 3,00,675 ఎకరాల భూమి ఉండగా 1,50,198 మంది అన్నదాతలు రైతు బంధు సాయం పొందుతున్నారు. రైతు బీమా పథకానికి 98,490 మంది అర్హులున్నారు. అర్బన్‌ జిల్లాలో 1,58,950 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా రైతు బంధు సాయం 68,728 మంది పొందుతున్నారు. రైతు బీమా అర్హులు 45,284 మంది ఉన్నారు.
 
పెరిగిన రైతు బంధు సాయం..
గత ఏడాది రైతు బంధు పథకం కింద ఏడాదిలో రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8వేలు ఇచ్చారు, వచ్చే ఖరీఫ్‌ నుంచి ఆ మొత్తం రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రూరల్‌ జిల్లాలో 1,50,198 మంది, వరంగల్‌ అర్బన్‌లో 68,728 మంది  రైతులు లబ్ధి పొందనున్నారు. రైతు బీమా కింద రూరల్‌ జిల్లాలో 98,490 మంది, అర్బన్‌ జిల్లాలో 45,284 మంది రైతులు బీమా పట్టాలను అందుకున్నారు. 2018 డిసెంబర్‌ 11 వరకు రైతు తీసుకున్న రూ.లక్ష వరకు బ్యాంకు రుణాలను మాఫీ చేయనున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి చెందనున్న గ్రామాలు
బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారు. ప్రతి గ్రామ అభివృద్ధికి ఎడాదికి రూ.8లక్షలు కేటాయించానున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 401 గ్రామ పంచాయతీలు, అర్బన్‌ జిల్లాలో 130 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామ పంచాయతీలకు ఉన్న సొంత ఆదాయ వనరులు, ఫైనాన్స్‌ కమిషన్, నేరుగా వచ్చే నిధులు కలిపి రాబోయే ఐదేళ్లల్లో గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పల్లెలు మరింత అభివృద్ధిలోకి రానున్నాయి.

మరింత ‘ఆసరా’ 
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి ఆసరా పథకం కింద చెల్లించే పింఛన్‌ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2016 కు పెంచుతున్నారు. అలాగే దివ్యాంగుల పింఛన్‌ రూ.1500 నుంచి రూ.3,016లకు పెంచనున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు మొత్తం 77,188 మంది, రూరల్‌లో 83,686, దివ్యాంగులు అర్బన్‌లో 11,484 మంది, రూరల్‌లో 13,525 మంది ఉన్నారు. అలాగే వృద్ధుల పింఛన్‌ అర్హతను 57 సంవత్సరాలకు కుదించడంతో మరింత మందికి ‘ఆసరా’ లభించనుంది.

నిరుద్యోగులకు భృతి..
నిరుద్యోగులకు భృతి కల్పించనున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 65,709 మంది, రూరల్‌లో 24,520 మంది నిరుద్యోగులు ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. అర్బన్‌లో డిగ్రీ ఉత్తీర్ణులు అయిన వారు 8,928, రూరల్‌లో 1,751 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించిన తరువాత అర్హులను ఎంపిక చేసి నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి రూ.3016 అందించనున్నారు. 

అన్ని వర్గాలకు అనుకూలం
ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది. ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించారు. బంగారు తెలంగాణ ఆశయ సాధన దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, భారీ నీటి పారుదల శాఖకు భారీ కేటాయింపులతో ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చినట్లైంది. అలాగే చిన్న, మధ్య తరగతి రైతుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం హర్షనీయం. దీని ద్వారా 8.58 లక్షల ఉద్యోగాల కల్పన అవకాశం లభించడం అభినందించ దగిన విషయం. నూతన కంపెనీలను స్థాపించేందుకు సులువుగా టీఎస్‌ఐపాస్‌ను ఏర్పాటు చేసి విజవంతం చేయడం ఆదర్శనీయం. – టి.రాఘవరెడ్డి, చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌

అన్నదాతకు వెన్నుదన్ను.. 
బడ్జెట్‌ రైతులకు రుణమాఫీ ఇతర పథకాలతో ఎంత మేలుజరగనుంది. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ ఫలితాలు అందజేసేలా కేటాయింపులు జరిగాయి. పదివేల జనాభాకు ఒక ఆస్పతిని నెలకొల్పుతారు. యువతకు నిరుద్యోగ భృతి కల్పించడం కూడా యువతకు ఎంతో ఉపయోగకరం. – సురేష్‌లాల్, కేయూ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌

రైతులను మభ్యపెట్టిన కేసీఆర్‌ 
నర్సంపేట: ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా మాయమాటలతో కేసీఆర్‌ రైతులను మభ్యపెడుతున్నారనడానికి  సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతుంది.   ఓట్‌ అనే అకౌంట్‌ బడ్జెట్‌ రైతులకు ఎంతమాత్రం ప్రయోజనం కాదు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సబ్సిడీపై ఇచ్చే విధంగా చర్యలకు దోహదం పడే విధంగా ఉండాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించి ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా బడ్జెట్‌లో పొందుపర్చకపోవడం బాధాకరం.  –పెద్దారపు రమేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి 

విద్యపై చిన్నచూపు 
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వ విద్యకు చిన్నచూపుచూశారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో 6.72శాతం మాత్రమే కేటాయించారు.గత ఏడాది బడ్జెట్‌ కంటే ఒక శాతం తక్కువగా కేటాయించటం గమనార్హం. కోఠారి సూచనలకు అనుగుణంగా బడ్జెట్‌లో 30 శాతం నిధులు కెటాయించాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు.నిరుద్యోగ భృతి అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ సరపడా నిధులు కేటాయించలేదు. టీపీటీఎఫ్‌ జిల్లా మాజీ జనరల్‌ సెక్రటరీ భీమళ్ల సారయ్య
 

అన్ని వర్గాలకు పెద్ద పీట
బడ్జెట్‌లో అన్ని వర్గాలకు పెద్ద పీట వేశారు. ఇరిగేషన్, వెల్ఫేర్‌ కోసమే లక్షల కోట్లు దాటుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా తయారు చేశారు. రైతు బంధుకు రూ.2వేల పెంపు, రుణ మాఫీ రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి అధిక ని«ధులు రానున్నాయి. – పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే

రైతన్నకు భరోసా..
అన్ని వర్గాలకు అనుకులమైన ప్రజా బడ్జెట్‌ ఇది. రైతన్నలకు మరింత భరోసా ఇచ్చారు. ఒక్కో గ్రామానికి రూ.8లక్షలు కేటాయించడంతో మరింత అభివృద్ధి చెందనున్నాయి. పింఛన్‌ మొత్తం పెంచడంతో వృద్ధులు, వికలాంగులు, వృత్తిదారులు, దివ్యాంగులు తదితరులకు మరింత ‘ఆసరా’ లభించనుంది. – అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే

సంక్షేమ బడ్జెట్‌
అన్ని రంగాల సంక్షేమమే ధ్యేయంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఉంది. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయం పెంపు, రుణమాఫీ, రైతు బీమా లాంటి పథకాలకు అధిక నిధులు కేటాయించడంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆసరా పింఛన్ల పెంపుతో వారిలో ఆత్మస్థైరాన్ని నింపారు. కళ్యాణలక్ష్మి, షాదిముబాకర్‌ కేటాయింపులు హర్షనీయం, నీటి పారుదలకు చేసిన భారీ కేటాయింపులతో ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతాయి. నిరుద్యోగ భృతి, అత్యంత వెనుకబడిన కులాలకు వెయ్యి కోట్లు కేటాయించడం సమర్థనీయం. ఆరోగ్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తంగా ఈ బడ్జెట్‌ రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇచ్చేలా ఉంది. ఉద్యోగ కల్పన కోసం పథకాల రచన ఉత్తమంగా భావించవచ్చు. – పీవీ.నారాయణరావు, సీఏ, ఐసీఏఐ, వరంగల్‌ బ్రాంచి మాజీ చైర్మన్‌

మరిన్ని వార్తలు