రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి

24 Jun, 2015 02:59 IST|Sakshi
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి

* పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ పిలుపు
* టీఎస్ ఐపాస్ కింద 17 పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందజేత
* ఉపాధి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికే నూతన పారిశ్రామిక విధానం
* సత్వర అనుమతులతో పారిశ్రామిక స్వర్ణయుగానికి నాంది

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన వాతావరణాన్ని ఉపయోగించుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ప్రకటించాక తొలిసారి పరిశ్రమల స్థాపన/విస్తరణకు ముందుకొచ్చిన 17 పరిశ్రమల ప్రతినిధులకు కేసీఆర్ మంగళవారం సచివాలయంలో అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పరి శ్రమల స్థాపనకు ముందుకొచ్చిన యాజమాన్యాలను అభినందించారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేసే లక్ష్యంతో సింగిల్ విండో అనుమతులతో కూడిన సరళతర విధానం టీఎస్ ఐపాస్‌ను రూపొందించామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ తదితర మౌలిక సౌకర్యాలను ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పరిశ్రమల విభాగం అధికారులు వేగంగా పనిచేశారని సీఎం కితాబిచ్చారు.
 
తక్కువ వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం తెలంగాణ పారిశ్రామిక స్వర్ణయుగానికి నాందిగా నిలుస్తుందన్నారు. సీఎం చేతుల మీదుగా అనుమతి పత్రాలు పొందిన వారిలో చిత్తరంజన్ ధర్, సంజయ్ సింగ్ (ఐటీసీ), బి.రవీంద్రనాథ్ (న్యూజెన్), ఎన్.వెంకటరాజు (అంజనీ పోర్ట్‌లాండ్), ఎన్.రెడ్డి (ఎంఎస్‌ఎన్ లైఫ్ సెన్సైస్), డి.రామిరెడ్డి (స్నేహ ఫాం), రాజరతన్ (పయనీర్ టార్‌స్టీల్), టీఎస్ ప్రసాద్ (సాలిత్రో), అంబుల్గే (కోవాలెంట్), వి.వి.రావు (భావనా సోలార్), కార్తీక్ పోల్సాని (ప్రీమియర్ ఫొటో వోల్టాయిక్), హరిబాబు (ఉషా వెంచర్స్), కృష్ణారెడ్డి (వాల్యూ లాబ్స్), సునిల్‌రెడ్డి (దొడ్ల డెయిరీ), జీఎం రమణ (హెచ్‌ఐఎల్), రాహుల్ వెంకట్ (డ్యూరాలైన్) తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కె. తారక రామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వినయ్ భాస్కర్, జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, పరిశ్రమలశాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు