19న కేసీఆర్‌ రాక..

16 Nov, 2018 18:14 IST|Sakshi

ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ 

కళాశాల మైదానంలో బహిరంగ సభ 

ఏర్పాట్లలో నిమగ్నమైన 

జిల్లా పోలీస్‌ యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం:  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 19వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఖమ్మం లోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి ఈనెల 1, 2వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని తొలుత భావించినా.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఊపొస్తుందనే భావనతో సభను 19వ తేదీన ఖరారు చేసినట్లు సమాచారం. అదేరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

కాగా.. ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్‌ అదేరోజు నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్‌ దాఖలు ప్రక్రియ పూర్తి కాగానే వారు కేసీఆర్‌ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించే తొలి ఎన్నికల ప్రచార సభ కావడంతో పది నియోజకవర్గాల నుంచి పోటీ చేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతోపాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలను పెద్దఎత్తున సమీకరించేందుకు పార్టీ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కేసీఆర్‌ పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కాగా.. సభ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పార్టీ నేతలతో చర్చించారు. నియోజకవర్గాల నుంచి జన సమీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలని నేతలకు సూచించారు. 

మరిన్ని వార్తలు