బీడీ కార్మికులను మోసగించిన కేసీఆర్

18 Jan, 2015 10:14 IST|Sakshi

బీడీ కార్మికుల ఓట్లతో ఎన్నికల్లో గెలిచి, వారినే మోసగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనని జహీరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  గీతారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం (ఐఎన్‌టీయూసీ) ఆధ్వర్యంలో దుబ్బాకలో నిర్వహించిన బీడీ కార్మిక మహాసభలో ఆమె మాట్లాడుతూ బీడీ కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక భిక్షాటన చేయాల్సిన దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని ఆమె విమర్శించారు. బీడీ కార్మికుల జీవన స్థితిగతులు తనకు తెలుసునని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి నెలకు రూ. వెయ్యి జీవన భృతి చెల్లిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారన్నారు.

బీడీ కార్మికులకు  భృతి ఇచ్చేంత వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమన్నారు. ఆంధ్ర ప్రాంత నేతలు వద్దన్నా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినా వేయకున్నా తమకేమీ బాధ లేదని, టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీడీ కార్మికులకు నెలకు రూ. వెయ్యి భృతి చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయిం చుకున్నారన్నారు.

తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. రాష్ట్రంలో పింఛన్లు రాక వృద్ధులు చనిపోతుంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం పాదయాత్రలు చేస్తున్నారన్నారు. సభలో డీసీసీ అధ్యక్షరాలు సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బండి నర్సాగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.

మరిన్ని వార్తలు