ఎంత మందికైనా చికిత్స అందిస్తాం: కేసీఆర్‌

9 Jun, 2020 01:57 IST|Sakshi

ఆ సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉంది: కేసీఆర్‌

కరోనా రోగులతో ‘గాంధీ’ కిక్కిరిసిపోవడం దుష్ప్రచారమే

2 వేల మంది సామర్థ్యంగల ఆస్పత్రిలో ఉన్నది 247 మందే

మృతులందరికీ పరీక్షలపై హైకోర్టు తీర్పు అమలు అసాధ్యం

కరోనాపై సమీక్షలో సీఎం కేసీఆర్‌కు వైద్యాధికారుల నివేదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంత మందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వాస్పత్రులకు ఉందని వైద్యాధికారులు, నిపుణులు స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 2 వేల మందికిపైగా చికిత్స అందించే సామర్థ్యంగల గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 247 మందే కరోనా బాధితులున్నారని స్పష్టం చేశారు. వాస్తవం ఇదైతే కొందరు పనిగట్టుకొని గాంధీ ఆస్పత్రి కరోనా రోగులతో కిక్కిరిసిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని అసంతప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం కేసీఆర్‌ సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో వైద్యాధికారులు, నిపుణులు ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

ఆ అంశాలు ఇవీ...
గాంధీ ఆస్పత్రి కరోనా పేషెంట్లతో కిక్కిరిసిపోతోందంటూ కొందరు వ్యక్తులు, కొన్ని పేపర్లు, వార్తా చానళ్లు సాగిస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధం. గాంధీలో 2,150 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. ఆస్పత్రిలో వెయ్యి ఆక్సిజన్‌ సౌకర్యంగల బెడ్లు ఉన్నాయి. ఈ సౌకర్యాలనే పూర్తిగా వాడుకునే అవసరం ఇంతవరకు రాలేదు. గాంధీలోని వైరస్‌ బాధితుల్లో చాలా మంది కోలుకొని ఇంటికెళ్లారు. వైద్యులు సకల సౌకర్యాలతో మంచి వైద్యం అందించారని సంతోషంగా చెబుతున్నారు. అయినా కొందరు విమర్శలు చేయడం బాధాకరం.

 రాష్ట్రంలో కరోనా పేషెంట్లు ఎక్కువైతే చికిత్స అందించే ఏర్పాట్లు లేవని కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. 9.61 లక్షల పీపీఈ కిట్లతోపాటు 14 లక్షల ఎన్‌–95 మాస్కులున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సౌకర్యంగల మొత్తం 3,600 బెడ్స్‌ను సిద్ధంగా ఉంచాం. వెంటిలేటర్లు, టెస్ట్‌ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇతరత్రా పరికారలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏ కొరతా లేదు.

► వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతోందనే ప్రచారం చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి కూడా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందిలో కొందరికి వైరస్‌ సోకుతోంది. ఇది చాలా సహజం. కేవలం తెలంగాణలోనే జరగట్లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 480 మందికి వైరస్‌ సోకింది. ఐసీఎంఆర్‌ అంచనా ప్రకారమే దేశంలో 10 వేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. అమెరికాలో 68 వేల మంది వైద్య సిబ్బందికి వైరస్‌ సోకగా బ్రిటన్‌లో వైరస్‌ సోకిన వారిలో 15 శాతం మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఇదే తరహాలో తెలంగాణలో ఇప్పటివరకు 153 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. రాష్ట్రంలో వైరస్‌ సోకిన వైద్య సిబ్బందిలో ఎవరి పరిస్థితీ సీరియస్‌గా లేదు. వారంతా కోలుకుంటున్నారు.

► కరోనా మరణాలుగా చెబుతున్నవన్నీ వైరస్‌ వల్ల సంభవించిన మరణాలు కాదు. దాదాపు 95 శాతం మంది రోగుల్లో కిడ్నీ, గుండె, లివర్, శ్యాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడే వారు, కేన్సర్‌ వ్యాధిగ్రస్తులు, షుగర్, బీపీ ఉన్న వారు చనిపోతున్నారు. ఇతర జబ్బులతో చనిపోయినప్పటికీ వారికి కరోనా ఉంది కాబట్టి వైరస్‌తోనే మరణించినట్లు నిర్ధారిస్తున్నారు. ఇది అశాస్త్రీయమైన అవగాహన. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోంది.

► కరోనా విషయమై తరచూ కోర్టులో కేసులు దాఖలవుతుండటం వల్ల సీనియర్‌ వైద్యాధికారులు రోజూ కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల కరోనా కేసులతోపాటు ఇతర కేసులను పర్యవేక్షించడం కష్టంగా మారుతోంది. ఈ కేసులన్నీ ఉద్దేశపూర్వకంగా వేస్తున్నవనే తెలుస్తోంది.

► ఏ కారణంతో చనిపోయినా సరే మరణించిన ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల రోజూ సగటున 900–1,000 మంది మరణిస్తుంటారు. వారందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యం? వైద్య సిబ్బంది వారికి పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే ఆస్పత్రుల్లో ఇతర వైద్య సేవలు సాధ్యం కాదు. రకరకాల జబ్బులతో వచ్చే వారు, డెలివరీల కోసం వచ్చే వారు ఉంటారు. ఇప్పుడు కరోనాతో వస్తున్న వారు ఉంటున్నారు. వారందరినీ వదిలేసి మృతదేహాలకు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదు. హైకోర్టు ఆదేశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆచరణ సాధ్యం కాదు. ఈ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలి.

అనవసరంగా ప్రజలు ఆందోళన చెందొద్దు: సీఎం కేసీఆర్‌
కరోనా విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించట్లేదని, చాలా తక్కువ మంది, అది కూడా ఇతర జబ్బులున్న వారే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అదే సమయంలో ప్రజలు కూడా ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువైనా తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం సీరియస్‌గా ఉన్న వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, వైరస్‌ సోకినప్పటికీ లక్షణాలు లేని వారికి హోం ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. 

మరిన్ని వార్తలు