పాలమూరు...పరుగులే 

29 Aug, 2019 02:06 IST|Sakshi

పనుల వేగిరంపై సీఎం దృష్టి 

ప్రాజెక్టు పనుల క్షేత్రస్థాయి పరిశీలనకు నేడు కేసీఆర్‌ 

వచ్చే ఖరీఫ్‌కు నీళ్లిచ్చేలా ఇంజనీర్లకు మార్గదర్శనం 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇక పై పరుగులు పెట్టనున్నాయి. గత రెండున్నరేళ్లుగా ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో సమీక్షలు జరిపిన ఆయన.. గురువారం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో కరివెన ప్రాజెక్టు వద్దకు చేరుకుని కరివెన, వట్టెం, నార్లాపూర్, ఏదులలో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి కృష్ణా జలాల్లోంచి ఒక టీఎంసీ నీటిని తీసుకుంటూ కనిష్టంగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టడంపై అధికార్లు, ఇంజనీర్లకు మార్గదర్శనం చేయనున్నారు. 

రుణాలతోనే పాలమూరు పనులు.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరం దించేలా రూ.35,200 కోట్ల అంచనాతో పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నిధుల కొరత, భూసేకరణలో జాప్యం కారణంగా పనులు ముందుకు కదల్లేదు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్, కరివెన రిజర్వాయర్ల పరిధిలోని పనులు చేపట్టినా.. పంప్‌హౌస్‌ల పనులు మాత్రం మొదలు కాలేదు. ఇప్పటివరకు ప్రాజెక్టు పరిధిలో నిర్మాణ, భూసేకరణ పనుల కోసం రూ.5,880 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు. ఒక టీఎంసీ నీటిని అందించాలన్నా కనిష్టంగా రూ.12 వేల కోట్ల మేర నిధులు అవసరం ఉంటుందని గుర్తించారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే పాలమూరు–రంగారెడ్డికి రూ.10వేల కోట్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. 

సీఎం పర్యటన షెడ్యూల్‌ ఇదే.. 
సీఎం కేసీఆర్‌ గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి  హెలికాప్టర్‌లో బయలు దేరి 10:15 గంటలకు కరివెన చేరుకుంటారు. 10: 45 గంటలకు వట్టెం, 11:20 గంటలకు నార్లాపూర్, 12:10 ఏదులకు వెళ్లి అక్కడ ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష చేపడతారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.  

నార్లాపూర్‌పై నేడు స్పష్టత 
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మొదటిదైన నార్లాపూర్‌ రిజర్వాయర్‌పై సీఎం పర్యటన సందర్భంగా స్పష్టత రానుంది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ డ్యాంలో నిర్మించిన రాక్‌ఫిల్‌ డ్యాం తరహా నిర్మాణాన్నే నార్లాపూర్‌లోనూ చేపట్టాలని గతంలో నిర్ణయించారు. నార్లాపూర్‌ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర మట్టి కొరతను అధిగమించేందుకు ఈ తరహా నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ తరహా నిర్మాణాలు గతంలో ఎన్నడూ లేకపోవడం, ఇంజనీర్లకు అనుభవం కూడా లేని దృష్ట్యా ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. మట్టికట్ట ద్వారానే నిర్మాణం చేపట్టిన పక్షంలో కట్ట పొడవును పెంచి ఎత్తును తగ్గించాలన్నది ఇంజనీర్ల అభిప్రాయం. అదే జరిగితే నార్లాపూర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 8.6 టీఎంసీల నుంచి 6.5 టీఎంసీలకు తగ్గనుంది. రాక్‌ఫిల్‌ డ్యాం తరహా నిర్మాణం చేపడతారా లేక మట్టికట్ట వైపే మొగ్గు చూపుతారా అన్నది గురువారం సీఎం పర్యటనలో తేలనుంది. 

మరిన్ని వార్తలు