సమర్థులను పోటీకి దించండి : కేసీఆర్‌

15 Apr, 2019 18:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్సే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్ధులను పోటీకి దించండని నేతలను కోరారు.

గ్రామస్థాయిలో వంద శాతం టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతమవ్వాలని తెలిపారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళణ తీసుకొని వస్తున్నామని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు ధర్నాలు చేసినా పట్టించుకోవద్దని సూచించారు. జీహెచ్‌ఎంసీలో కూడా ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ ఇంచార్జులను నియమించారు. ఈ ఎన్నికల బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ప్రధాన కార్యదర్శులకు కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా కోవా లక్ష్మీని, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థిగా పుట్టా మధును ప్రకటించారు.

మరిన్ని వార్తలు