క్రిస్మస్‌ గిఫ్ట్‌లు రెడీ

9 Dec, 2019 08:17 IST|Sakshi
క్రిస్మస్‌ గిఫ్ట్‌లలు, సూర్యాపేటలో గిఫ్ట్‌ల బస్తాలు దించుతున్న కార్మికులు

జిల్లాకు ఈ సారి 4వేల జతల దుస్తులు రాక

ప్రేమ విందుకు రూ. 8లక్షలు విడుదల

ప్రతి నియోజకవర్గంలో 1,000మందికి భోజనాలు, దుస్తులు

రేపటి నుంచి పంపిణీ

పేదలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికే.. నిరుపేదలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేయడంతో పాటు విందు కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలో 4వేల మందికి క్రిస్మస్‌ దుస్తులు మంజూరయ్యాయి. ఈ దుస్తుల పంపిణీ మంగళవారం నుంచి మొదలుకానుంది. ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది చొప్పున జిల్లాలో 4వేల మందికి ప్రేమవిందుకు రూ. 8లక్షలు వచ్చాయి. 
–  ఎల్‌.శ్రీనివాస్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి

అర్వపల్లి (నల్గొండ) : క్రిస్మస్‌ గిఫ్ట్‌లు వచ్చేశాయి. ఈనెల 10వ తేదీనుంచి జిల్లాలో దుస్తులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పేదలు సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రతి ఏటా దుస్తుల పంపిణీతో పాటు విందు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంబంధించి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ సారి క్రిస్మస్‌కు క్రైస్తవుల కోసం జిల్లాలో 4వేల జతల దుస్తులు రాగా పంపిణీకి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25న జరిగే క్రిస్మస్‌కు ముందే దుస్తుల పంపిణీ, విందు పూర్తికానుంది. 

జిల్లాలో 4వేల మంది క్రైస్తవులకు.. 
జిల్లాలో 16వేల మంది క్రైస్తవులు ఉండగా ఇందులో 4వేల మంది పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో 4వేల మందికి దుస్తులు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి సంబంధించిన గిఫ్ట్‌ ప్యాకెట్లను ఇప్పటికే హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రాలకు చేర్చారు. సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు సోమవారం దుస్తులను చేర్చనున్నారు. ఈ నెల 10 తేదీ నుంచి నుంచి గ్రామాల వారీగా దుస్తుల పంపిణీ మొదలు కానుంది. 

ప్రేమ విందుకు రూ. 8లక్షలు మంజూరు:
క్రైస్తవులకు క్రిస్మస్‌ సందర్భంగా ప్రేమవిందుకు ప్రభుత్వం జిల్లాకు రూ. 8లక్షలు మంజూరు చేసింది. అయితే ఒక్కో నియోజకవర్గానికి రూ. 2లక్షల చొప్పున జిల్లానుంచి సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి నాలుగు నియోజకవర్గాలకు ఈ నిధులు కేటాయించారు. నియోజకవర్గానికి 1,000 మంది క్రైస్తవులకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి నుంచి19 వరకు ప్రేమవిందు  కార్యక్రమం పూర్తికానుంది. దీనికోసం మండలాల వారీగా తహసీల్దార్లు.. క్రైస్తవులతో కమిటీలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. 

మరిన్ని వార్తలు