ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లోకి..

10 Oct, 2017 02:13 IST|Sakshi

జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్‌!

ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టే వ్యూహం

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారం కోసం..

అధికార పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగనున్నారా..? అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజలకు వివరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారా..? ఈ ప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటన కేలండర్‌ ఖరారు అయినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.

దాదాపు అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రతిపక్షాలు, జేఏసీ వంటి ప్రజాసంఘాల నుంచి విమర్శల దాడి జరుగుతున్న తీరుపై పార్టీలో జరిగిన చర్చ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున ఖరీప్, రబీ పంటలకు కలిపి రూ.8 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం పక్కదోవ పట్టకుండా ఉండేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

దీన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా ఇతర రాజకీయ పక్షాలు వ్యతిరేకించడం తదితరాలపై అధికార పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకూ అడ్డంకులు సృష్టించడం, కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకురావడం వంటి అంశాలపై వాస్తవాలను తన పర్యటనలో వివరించనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఏడాది కిందటే సీఎం జిల్లా పర్యటనలు ఉంటాయని ప్రచారం జరిగినా, ఇప్పటికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఈ పర్యటనలో పార్టీ కేడర్‌లోనూ ఉత్సాహం నింపొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది గడిచిన నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం కూడా ఈ పర్యటనల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు.  


11న సిద్దిపేటతో ప్రారంభం..
సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో బహిరంగ సభల్లో 11న పాల్గొనడంతో పాటు అదేరోజు నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 12న సూర్యాపేటలో బహిరంగ సభలో పాల్గొంటారు. సోమవారం జరగాల్సి ఉన్నా వాయిదా పడ్డ నారాయణఖేడ్‌ పర్యటన 13న పూర్తి చేయనున్నారు.

20న వరంగల్‌ రూరల్, అర్బన్‌ జిల్లాల్లో పర్యటించి వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన, ఔటర్‌రింగ్‌ రోడ్‌ పనులను ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఈ నెల 29తో గత అసెంబ్లీ సమావేశాలు ముగిసి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ లోపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తర్వాత నవంబర్‌లో మరికొన్ని జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు