తెలంగాణ రాజ్యాంగాన్ని రాస్తున్న కేసీఆర్‌ 

15 Apr, 2019 02:38 IST|Sakshi

ఆయన తీరు దేశసార్వభౌమాధికారానికే ప్రమాదం

 టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు భారత రాజ్యాంగంపై నమ్మకం లేకే తెలంగాణ రాజ్యాంగాన్ని రాసే దిశలో అడుగులు వేస్తున్నారని  టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి  తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే ఆయన కేంద్ర చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు నారాయణరెడ్డి ఆదివారం ఒక విడుదల చేశారు. అఖిల భారత సర్వీసు తరహాలో తెలంగాణ  రాష్ట్రంలో పరిపాలన సర్వీసులను తీసుకురావాలనే కేసీఆర్‌ ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలను తీసుకు వచ్చే ముందు రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 4,244 ఉద్యోగ పోస్టులను, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 2,612  ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

భూసేకరణ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత లాంటి అనేక చట్టాల్లో తెలంగాణ రాష్ట్రం మార్కు చూపించాలని ప్రయత్నం చేశారని,  ఇప్పుడు కొత్తగా రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలను తేవాలని చూస్తున్నారని విమర్శించారు. శాసన, పరిపాలన, కార్యనిర్వాహక అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయని రాజ్యాంగం స్పష్టం చేస్తుంటే చంద్రశేఖర్‌ రావు మాత్రం కేంద్రానికి ఉన్న అధికారాలను ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ వేస్తున్న ఇటువంటి అడుగులు మన దేశ సార్వభౌమాధికారానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ వెంటనే ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. పరిపాలన రంగంలో మార్పు తేవాలనుకుంటే ముందుగా రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నారాయణరెడ్డి కోరారు. కేసీఆర్‌ ఎప్పుడూ రాజ్యాంగంపై గౌరవం ప్రదర్శించలేదని, రాజ్యాంగంలో పేర్కొన్న పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించి తన హయాంలో 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని గూడూరు గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు