కేసీఆర్ పాలనలో కరెంట్ కష్టాలు

17 Nov, 2014 04:19 IST|Sakshi
కేసీఆర్ పాలనలో కరెంట్ కష్టాలు

మిడ్జిల్: తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడూ రైతులకు కరెంట్‌కష్టాలు రాలేదని, కేసీఆర్ పాలనలో ఈ కష్టాలు రావడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఆదివారం మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా పొన్నాల ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాలుగురోజులకే దిష్టబొమ్మల ను దహనం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. సోనియాగాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు. నేడు రాష్ట్ర ప్రజ లు మళ్లీ కాంగ్రెస్ పార్టీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. గ్రామగ్రామా నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ఏఐసీసీ కార్యదర్శి రాంచందర్ కూటియా మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రజలు రూ.5 చెల్లించి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు.

జిల్లాలో రెండువేల సభ్యత్వాలు నమోదుకావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి న హామీలను అమలుచేయడంలో పూర్తి గా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ కింద ఇచ్చిన 25శాతం బ్యాంకుల వడ్డీలకే సరిపోయిందన్నారు.

 టీడీపీ, టీఆర్‌ఎస్ కుటుంబ పాలన
 మాజీమంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, టీడీపీలో కుటుంబ పాలననే ఉంటుందని, రెండు పార్టీలకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు వారేనన్నారు. కాంగ్రెస్‌పార్టీలో అలాంటి సంస్కృతి ఉం డదన్నారు. సామాన్యుడికి కూడా పదవి దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మ ల్లు రవి మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించారని విమర్శించారు.

రాష్ట్రంలో అర్హులైన వారిందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్, వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు రబ్బానీ, కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు తిరుపత్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, సాయిలు, గోపి, సంపత్, జ్యోతి, కృష్ణయ్య, బాలయ్య, రమేష్ నాయక్ పాల్గొన్నారు.

 నేతలకు ఘన స్వాగతం
 కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు మిడ్జిల్‌కు వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రాంచందర్ కుటియా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే చిన్నారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలకు స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు స్థానిక బస్టాండ్‌లో గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు