రేపటి నుంచి కేసీఆర్‌ ప్రచారం

28 Mar, 2019 02:26 IST|Sakshi

13 సెగ్మెంట్లలో బహిరంగ సభలు

ఏప్రిల్‌ 4 వరకు వరుస కార్యక్రమాలు 

సభల ఏర్పాట్లపై ఇన్‌చార్జీలకు కేసీఆర్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడు పెంచింది. 16 లోక్‌సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. మార్చి 29న నల్లగొండ నుంచి ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాల్సిన ఆవశ్యతను వివరిం చనున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్న నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచే కేసీఆర్‌ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నా రు. మొదటిరోజే సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొంటారు. కేసీఆర్‌ మార్చి 17న కరీంనగర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 19న నిజామాబాద్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. అభ్యర్థుల ప్రకటన, లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఇన్‌చార్జీల నియామకం, ప్రచార సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తి చేసేందుకు 10 రోజులపాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు.

తాజాగా శుక్రవారం నుంచి పూర్తి స్థాయి ప్రచారంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఒకేరోజు రెండుమూడు లోక్‌సభ సెగ్మెంట్లలో ప్రచార సభలు నిర్వహించేలా కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ సిద్ధమైంది. ఇప్పటికే రెండు సెగ్మెంట్లలో ప్రచారం పూర్తి చేశారు. మరో 13 సెగ్మెంట్లలో ప్రచార షెడ్యూల్‌ను శనివారం ఖరారు చేశారు. ఆదిలాబాద్‌లో ప్రచారసభ నిర్వహణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ప్రచార సభల ఏర్పాట్లపై లోక్‌సభ ఇన్‌చార్జీలతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

►మార్చి 29న సాయంత్రం నాలుగు గంటలకు నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు హైదరబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల (కొంత భాగం) లోక్‌సభ సెగ్మెంట్ల ఉమ్మడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

►మార్చి 31న సాయంత్రం నాలుగు గంటలకు నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లోని వనపర్తి సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటలకు మహబూబ్‌నగర్‌ బహిరంగ సభకు హాజరవుతారు. 

►ఏప్రిల్‌ 1న సాయంత్రం నాలుగు గంటలకు పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లోని రామగుండం సభలో పాల్గొంటారు.  

►ఏప్రిల్‌ 2న సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటలకు భువనగిరి సభలో ప్రసంగిస్తారు. 

►ఏప్రిల్‌ 3న సాయంత్రం నాలుగు గంటలకు అంథోల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరగనున్న జహీరాబాద్‌ సెగ్మెంట్‌ సభకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటలకు నర్సాపూర్‌లో జరగనున్న మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ ప్రచారసభలో పాల్గొంటారు.  

►ఏప్రిల్‌ 4న సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్‌ సభలో పాల్గొంటారు. ఐదున్నర గంటలకు ఖమ్మం బహిరంగ సభకు హాజరవుతారు.

మరిన్ని వార్తలు