ముచ్చటగా మూడోసారి.. 

26 Nov, 2018 07:04 IST|Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభ కోసం సోమవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ తరఫున పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బహిరంగసభలు నిర్వహిస్తున్న ఆయన.. నేడు కరీంనగర్, జగిత్యాలలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్‌ ఈ వేదికల ద్వారా ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించనున్నారు.

మధ్యాహ్నం 1.15 గంటలకు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ సభలో పాల్గొని అక్కడినుంచి జగిత్యాల జిల్లా కేంద్రంలో 2 గంటలకు జరిగే సభకు హాజరవుతారు. హెలికాప్టర్‌ ద్వారా మధ్యాహ్నం 2.45 గంటలకు కరీంనగర్‌లోని హెలిప్యాడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు 3 గంటలకు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం 3.25 గంటలకు కరీంనగర్‌ హెలిప్యాడ్‌ నుంచి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు తిరుగు పయనం అవుతారు.              

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:
సోమవారం పాత నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో నిర్వహించే 9 బహిరంగ సభలలో పాల్గొననున్న కేసీఆర్‌.. ఉదయం 11 గంటలకు కామారెడ్డి నుంచి మొదలు పెట్టి సాయంత్రం 5 గంటలకు వరంగల్‌లో ముగించనున్నారు. సమయాభావం వల్ల 9 బహిరంగ సభల్లో కేసీఆర్‌ ప్రతిచోట 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగా ఆరు నియోజకవర్గాలు కలిసొచ్చేలా.. రెండు సభలు ఏర్పాటు చేశారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి జగిత్యాలలో.. కరీంనగర్, మానకొండూరు నియోజకవర్గాల కోసం కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాల ఆవరణలో సభలను ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2గంటలకు జగిత్యాలలో సభను ముగించుకుని 3 గంటలకు ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల గ్రౌండ్‌కు కేసీఆర్‌ చేరుకుంటారు.

కేసీఆర్‌ మూడో విడత పర్యటన
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల కోసం కేసీఆర్‌ పర్యటించడం ఇది మూడోసారి. సెప్టెంబర్‌ 7న హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాదసభ పేరిట తొలి సభను నిర్వహించిన కేసీఆర్‌.. రెండో విడత పర్యటనలో భాగంగా ఈనెల 20న మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సభలతో హోరెత్తిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే సభల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.

ఈ రెండు సభల కోసం జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేయడంలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. కరీంనగర్‌లో నిర్వహించే సభ సక్సెస్‌ కోసం కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్, తాజామాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. ఎస్సారార్‌ కళాశాల గ్రౌండ్స్‌లో సభావేదిక ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. వరుస ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్న కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ఇప్పటికే హోరెత్తించారు. సోమవారం నిర్వహించే సభలతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్‌ రానుంది.

ఆశీర్వాదసభను విజయవంతం చేయండి : తాజామాజీ ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాల మైదానంలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని తాజామాజీ ఎమ్మెల్యే, కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ కోరారు. తెలంగాణ ఉద్యమ రథసారధి, అలుపెరుగని ప్రజా నాయకుడు కేసీఆర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అదృష్టమని అన్నారు. కోటి ఎకరాల మాగాణి, బంగారు తెలంగాణ కోసం నిరంతరం పరితపించే కేసీఆర్‌ మరోసారి సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేసిందని, అహర్నిశలు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ పార్టీని మరోసారి ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఎన్నికల ప్రచార సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు