పోరుగడ్డకు గులాబీ దళపతి

19 Nov, 2018 09:44 IST|Sakshi
పాలకుర్తిలో నేడు టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

హాజరుకానున్న కేసీఆర్‌ ఎర్రబెల్లి నేతృత్వంలో 

భారీ జనసమీకరణ 23న జనగామలో సభ

సాక్షి, జనగామ/పాలకుర్తి: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీ అధినేత కేసీఆర్‌ మలివిడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన ఎన్నికల ప్రచారాన్ని పోరుగడ్డ జనగామ జిల్లా నుంచి ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పాలకుర్తి బహిరంగసభతో ప్రచారాన్ని మొదలుపెట్టి కార్యకర్తలు, పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. బహిరంగసభను సక్సెస్‌ చేయడం కోసం భారీగా జన సమీకరణ చేయడానికి ఆ పార్టీ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు  నేతృత్వంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

నేడు పాలకుర్తికి కేసీఆర్‌..
జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం జరిగే భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరుకానున్నారు. పాలకుర్తి నుంచి పోటీచేస్తున్న దయాకర్‌రావు గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం ఎర్రబెల్లి దయాకర్‌రావు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. పాలకుర్తి బస్టాండ్‌ సమీపం జనగామ రోడ్డులోని మైదానంలో సభను నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగే బహిరంగసభలో కేసీఆర్‌ పాల్గొని నేరుగా హెలీక్యాప్టర్‌ ద్వారా పాలకుర్తికి చేరుకోనున్నారు. బహిరంగసభలో ప్రసంగించి  హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
 
బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి..
బహిరంగసభకు టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. కేసీఆర్‌ పాల్గొంటున్న బహిరంగసభ కావడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగసభ స్థలాన్ని చదును చేయించడంతోపాటు వేదిక నిర్మాణంపై ప్రత్యేకదృష్టి పెట్టారు. ఈ బహిరంగసభకు 60వేల మందిని తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గం కావడంతో సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.  కేసీఆర్‌ సభకు పోలీసులు భారీ బందోబస్తు సిద్ధం చేశారు. 

సాయంత్రం నాలుగు గంటలకు ప్రసంగం
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని బస్‌స్టేషన్‌ సమీపంలో నిర్వహించే ఈ సభలో కేసీఆర్‌ సా యంత్రం నాలుగు గంటలకు ప్రసంగిస్తారు. 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన సభా స్థలికి సు మారు 60 వేల మందిని తరలించాలని నిర్ణయించారు. సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. సీపీ రవీం దర్‌ సభాస్థలిని,హెలిప్యాడ్‌ స్థలాన్ని ఆదివారం ప రిశీలించారు. బహిరంగ సభ స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అడుగడుగునా మెటల్‌ డిటెక్ట ర్లు, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. సభ కు 600 మంది పోలీసు సిబ్బందిని తరలించి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. సభాస్థలిని చేరుకోలేక ప్రధాన రోడ్లపై సీఎం ప్రసంగాన్ని వినేందుకు రాజీవ్‌ చౌ రస్తా,గుడివాడ చౌరస్తా,బస్‌స్టేషన్‌ సమీపంలో పెద్ద స్క్రీన్‌ ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటుచేస్తున్నారు.  

23న జనగామలో బహిరంగ సభ..
పాలకుర్తి బహిరంగ సభ తరువాత ఈనెల 23న జిల్లా కేంద్రానికి కేసీఆర్‌ రానున్నారు. జనగామలో ముత్తిరెడ్డి  యాదగిరిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. కేసీఆర్‌ వరుస బహిరంగసభలతో టీఆర్‌ఎస్‌లో కొత్త ఊపును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.  

మరిన్ని వార్తలు