‘ఆశీర్వాదానికి’ వేళాయె..

23 Nov, 2018 07:09 IST|Sakshi
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:‘గులాబీ’ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి,  మహబూబాబాద్‌లో శంకర్‌నాయక్, డోర్నకల్‌ నియోజకవర్గం మరిపెడలొ రెడ్యా నాయక్‌ లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆశీర్వాద బహిరంగ సభ నర్సంపేట  నుంచి ప్రారంభం కానుంది.  హైదరాబాద్‌ నుంచి కేసీఆర్‌ హెలీకాప్టర్‌లో నేరుగా నర్సంపేటకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అనంతరం మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడలో నిర్వహించే సభకు హాజరై  ప్రసంగించనున్నారు.  ఇక్కడ సభ ముగియగానే సూర్యపేటకు వెళ్లిపోతారు. అక్కడి  నుంచి తిరిగి జనగామ నియోజకవర్గానికి చేరుకుంటారు. హన్మకొండ రహదారిలోని ప్రిస్టన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొననున్నారు.

నర్సంపేటలో..
వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో ఆశీర్వాద సభ  ఉదయం 11 గంటలకు మొదలుకానుంది. పట్టణ శివారులోని పాకాల రోడ్డు వెంట ఉన్న సర్వాపురం గ్రౌండ్‌లో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని ఎంఏఆర్‌ ఫంక్షన్‌ హల్‌ ముందు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అక్కడి నుంచి కేసీఆర్‌ వాహనంలో సభాస్థలికి చేరుకోనున్నారు. గురువారం ఉన్నతాధికారులు హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేపట్టారు. పట్టణం మీదుగా  రెండు రౌండ్లు తిరిగారు.  నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఉదయం 10 గంటలకే  సుమారు 50 వేల మందిని సభకు తరలించేలా ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు .

జనగామలో...
జనగామ  పట్టణంలోని హన్మకొండ రోడ్డులో ఉన్నే ప్రిస్టన్‌ మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ గ్రౌండ్‌ సమీపంలోని బతుకమ్మ కుంటలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల నుంచి సుమారు 50 వేల మంది జనసమీకరణ చేసేలా పార్టీ శ్రేణలు పనిచేస్తున్నాయి. నెహ్రూపార్కు సమీపంలోని వైకుంఠ ధామం ఏరియాతో పాటు హన్మకొండ రోడ్డులోని ప్రిస్టన్‌ గ్రౌండ్‌ వెనుక పార్కింగ్‌ కోసం స్థలాన్ని కేటయించారు.

మానుకోటలో ...మానుకోటలో 11.45 గంటలకు సభ జరగనుంది. తొర్రూర్‌ రోడ్డు మార్గంలోని బాలాజీ దారిలో సభ ఏర్పాట్లు చేశారు.  సభా స్థలికి సుమారు అర కిలో మీటర్‌ దూరంలో హెలీప్యాడ్‌ సిద్ధమైంది.  45 నిమిషాల పాటు ఇక్కడ ప్రసంగించిన తర్వాత 12.30 కి డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడ బహిరంగ సభలో పాల్గొంటారు.  ఒక్కొక్క  సభకు 50 వేల పై చిలుకు ప్రజలను తరలించేలా ఆయా అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేశారు. అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచే టీఆర్‌ఎస్‌ నాయకులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

మరిన్ని వార్తలు