పరిస్థితి అదుపులోనే..

21 Jul, 2020 01:35 IST|Sakshi

కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం

గవర్నర్‌ తమిళిసైకి వివరించిన సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు, రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎంతమందికైనా చికిత్స అందించేందుకు సంసిద్ధతతో ఉన్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలోనే ఉన్నాయని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఇతర వర్తమాన అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. కరోనా రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందిస్తున్నామని, కొందరు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజలు హైరానాపడి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్ప త్రుల చుట్టూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. 1,200 మంది పీజీ వైద్యులతో పాటు 200 మంది పీహెచ్‌సీ వైద్యులను నియమించి ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయనున్నామని గవర్నర్‌కు నివేదించారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించడానికి ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు అన్ని చిక్కు లు తొలగిపోయాయని, రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు అద్భుతరీతిలో కొత్త సచివాలయ భవన సముదా య నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించను న్నామని గవర్నర్‌ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌తో పాటు గవర్నర్‌ కార్యాలయం రాజ్‌భవన్‌లో కొందరు ఉద్యోగులు కరోనా బారినపడిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.  

జిల్లాకో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేయాలి: గవర్నర్‌ 
జిల్లాకు ఒక ప్లాస్మా బ్యాంకును ఏర్పాటుచేయాలని, ప్లాస్మా దాతలకు ప్రోత్సాహకాలు అందించా లని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా తాను నిర్వహించిన సమావేశాలు, సదస్సుల్లో వివిధ రంగాల నిపుణుల నుంచి వచ్చిన సలహా సూచనలను గవర్నర్‌ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారని, విస్తృత రీతిలో పరీక్షలు నిర్వహించాలని గవర్నర్‌ కోరినట్టు తెలిసింది. మొబైల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిపడే వారికి ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు సమాచారం.

ఏదైనా ప్రాంతంలో గణనీయ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడితే ఆ ప్రాంతం పరిధిలోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించాలని గవర్నర్‌ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అలాగే, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీ, బెడ్ల కృత్రిమ కొరతపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో కమిటీ వేసి ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ కోరినట్టు తెలిసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత, వినియోగం, ఖాళీ బెడ్ల సంఖ్యను ఎప్పటికప్పుడు రోగులు తెలుసుకునేలా పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని గవర్నర్‌ కోరినట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు