హామీల అమలులో కేసీఆర్‌ విఫలం

21 Nov, 2018 18:24 IST|Sakshi
మాట్లాడుతున్న జనక్‌ ప్రసాద్‌

ఓపెన్‌ కాస్టు టెండర్లు ఆంధ్రావారికి ధారాదత్తం 

ఐఎన్‌టీయూసీ జనరల్‌ సెక్రటరీ జనక్‌ ప్రసాద్‌ ఆరోపణ

సింగరేణి(కొత్తగూడెం): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే ఇటు సింగరేణిలో, అటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని ఐఎన్‌టీయూసీ జనరల్‌ సెక్రటరీ జనక్‌ప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సజావుగా నడిచే ప్రభుత్వాన్ని తొమ్మిది నెలలు ముందుగానే రద్దుచేసిన కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలన్నారు. 10 వేల గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తానన్న కేసీఆర్‌ ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని, సంవత్సరానికి పదివేల డబుల్‌ బెడ్‌ రూమ్‌లను నిర్మిస్తానన్న  హామీని నిలుపుకోలేదన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా నీరిచ్చిన తరువాతే ఓట్లు అడుగుతానన్న కేసీఆర్‌ చుక్కనీరు ఇ చ్చిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ జెండాతో గెలిసిన వారికి ఉత్తచేయి చూపించారన్నారు. వేరే పార్టీల జెండాలతో గెలిచిన నాయకులను పార్టీలోకి ఆహ్వానించి మంత్రి పదవులను కట్టబెట్టారని ఆరోపించారు.
సింగరేణిలో గనులను మూసివేసి వాటి స్థానంలో ఓపెన్‌ కాస్టులకు టెండర్లు పిలిచి ఆంధ్రావారికి ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఒకరోజు సర్వీసు ఉన్నవారికి మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌కు అవకాశం ఇస్తానన్న కేసీఆర్‌ రెండు సంవత్సరాల సర్వీసు నిబంధనను ప్రతిపాదించి 16 జబ్బులున్న వారిని సైతం ఇన్‌వాలిడేషన్‌ చేయకుండా దరఖాస్తు చేసుకున్న వారిలో 50  శాతం మాత్రమే ఇన్‌వాలిడేషన్‌ చేస్తున్నారన్నారు.   సింగరేణి వ్యాప్తంగా నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న మహాకూటమి అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని కోరారు.   కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావును, ఖమ్మంలో నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఐఎన్‌టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, ఎన్‌ఎస్‌ఆర్‌ మూర్తి, సదానందం, ధర్మపురి, కాలం నాగభూషణం, మురళీ, శ్రీనువాస్, వెంకటస్వామి, భిక్షపతి, శ్యాం పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు