కేసీఆర్‌ కుటుంబానికే బంగారు తెలంగాణ

26 Nov, 2018 15:55 IST|Sakshi
చిన్నమల్లారెడ్డిలో మాట్లాడుతున్న షబ్బీర్‌అలీ

నాలుగేళ్లలో ఒక్క హామీ నెరవేర్చలేదు

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు

టీఆర్‌ఎస్‌లో మహిళలకు సముచిత స్థానం లేదు 

కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీ

సాక్షి, కామారెడ్డి రూరల్‌: తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకుంటే కేసీఆర్‌ కుటుంబానికి, ఆయన ఎమ్మెల్యేలకే బంగారు తెలంగాణ వచ్చిందని కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం చిన్నమల్లారెడ్డి, తిమ్మక్‌పల్లి(కె), సరంపల్లి, లింగాయిపల్లి, కోటాల్‌పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు డప్పు వాయిద్యాలతో, బోనాలతో షబ్బీర్‌అలీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాలుగున్నరేళ్లలో ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నాడని విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూ ఇళ్లు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూపంపిణీ చేస్తానని చేయలేదని, కేసీఆర్‌ జూటా మాటలు నమ్మవద్దన్నారు.

రూ. 300 కోట్లతో కేసీఆర్, మూడంతుస్తుల భవనాన్ని గంప గోవర్ధన్‌లు నిర్మించుకున్నారన్నారు. 133 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ మాటకు కట్టుబడి ఉండే పార్టీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇవ్వరని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార న్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రంలో రూ. 11 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉండేదని ఇప్పుడు రూ. 2 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పేరుతో రోడ్లన్నీ నాశనం చేశారని కానీ ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వలేదన్నారు. పథకాల పేరుతో టీఆర్‌ఎస్‌ నాయకులు జేబులు నింపుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని, ఒక్కొక్కరికి 7 కిలోల సన్నబియ్యంతో పాటు 9 రకాల సరుకులు అందిస్తామని, ఏడాదిరి 6 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సయ్యద్‌ యూసుఫ్‌అలీ, ఎడ్ల రాజిరెడ్డి, జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు ఉరుదొండ నరేశ్, ఎంపీటీసీ సభ్యుడు ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు