శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో’ విస్తరణ

13 May, 2015 02:10 IST|Sakshi

* ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
* 2017 ఏప్రిల్ నాటికి ‘మెట్రో’ పూర్తి
చేయాలి
* ఫలక్‌నుమా, రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి మార్గం..
* ఇన్నర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని రెండో దశ మెట్రో మార్గం నిర్మించాలని సూచన

 
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును 2017 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రో రెండో దశలో ఫలక్‌నుమా, రాయదుర్గం ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో మార్గం వేయాలని సూచించారు. ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మీదుగా ఇన్నర్‌రింగ్‌రోడ్డుకు ఆనుకొని నిర్మించాలన్నారు. మంగళవారం మెట్రోపై సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా మూడు మార్గాల్లో ఇప్పటివరకు 19 కి.మీ మేర పనులు పూర్తిస్థాయిలో జరిగాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
 
 36.5 కి.మీ మార్గంలో పిల్లర్లపై మెట్రో పట్టాలు పరిచేందుకు వయాడక్ట్ సెగ్మెంట్లను అమర్చామని అధికారులు సీఎంకు వివరించారు. కాగా, మెట్రోకు ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు సీఎం చెప్పారు. ప్రధాన రహదారులపై మెట్రో పనుల కోసం భూసేకరణ, పునరావాసం, రోడ్ల వెడల్పు పనులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్నామన్నారు. మెట్రో ప్రాజెక్టుకు అగ్నిమాపక అనుమతులు మంజూరుకు సంబంధించిన ఫైలుపై సీఎం సంతకం చేశారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో వాణిజ్య ప్రకటనల విషయంలో నిర్మాణ సంస్థ కోరిన రాయితీలపైనా చర్చ జరిగింది.
 
 సబ్సిడీ ధరల్లో మెట్రోకు విద్యుత్..
మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ను సబ్సిడీ ధరల్లో అందించేందుకు కేసీఆర్ అంగీకరించారు. మెట్రో కోసం ఉప్పల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మెట్రో ప్రాజెక్టును త్వరితంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.  
 
 అధ్యయన నివేదిక ఎప్పుడు..?
 ఓల్డ్‌సిటీలో అలైన్‌మెంట్ మారడంతో ఈ మార్గంలో మెట్రో మార్గం 3.2 కి.మీ పెరిగిన విషయం విదితమే. మారిన రూట్లో ప్రాజెక్టును చేపడితే సాంకేతికంగా, వాణిజ్యపరంగా తలెత్తే సమస్యలపై నిర్మాణ సంస్థ చేస్తున్న అధ్యయనంపైనా సీఎం ఆరా తీసినట్లు తెలిసింది.  మారిన మార్గంలో పనులను చేపట్టాలంటే మూసీ నది మధ్య నుంచి పిల్లర్లు, వయాడక్ట్‌లను, స్టేషన్లను నిర్మించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినదని ఎల్‌అండ్‌టీ వర్గాలు  వివరించినట్లు సమాచారం. సుల్తాన్‌బజార్ చారిత్రక మార్కెట్‌ను రక్షించేందుకు కోఠి ఉమెన్స్ కళాశాల మీదుగా మెట్రోను మళ్లిస్తే తలెత్తే సమస్యలను సైతం సీఎంకు నివేదించినట్లు తెలిసింది. అసెంబ్లీ వెనుకవైపు నుంచి లక్డీకాపూల్  వరకు చేపట్టనున్న మెట్రో మార్గంపైనా సీఎంకు తాము రూపొందించిన ప్రత్యామ్నాయాలను ఎల్‌అండ్‌టీ వివరించినట్లు సమాచారం. వీటిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు