‘ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ నంబర్‌1’

15 Aug, 2017 18:19 IST|Sakshi

♦ స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్‌
♦ త్వరలో 84,876 కొత్త ఉద్యోగాలు
♦ తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలన్నాం.. అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం
♦ కొత్త పరిశ్రమలతో 2.90 లక్షల మందికి ఉపాధి
♦ వృద్ధి రేటులో దేశంలో తెలంగాణది మొదటి స్థానం
♦ ఇకముందూ అన్ని రంగాల్లో అది కొనసాగుతుంది
♦ అడ్డుకునేందుకు యత్నించే శక్తుల కుయుక్తులను ఛేదించి ముందుకు సాగుతాం
♦ స్వాతంత్ర దినోత్సవ వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు


 
 
హైదరాబాద్‌: ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నెం.1గా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. భారత 71 స్వాతం‍త్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలోని రాణిమహల్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆర్థిక క్రమశిక్షణతోనే ఈ ప్రగతి సాధ్యమైందని పేర్కొన్నారు.
 
పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు కొత్తగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్‌పై రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలంగాణలో డ్రగ్స్‌ మాఫియాను అంతం చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ సాయంతో పెద్ద ఎత్తున గొర్రెల, చేపల పెంపకం జరుగుతోందని తెలిపారు. చేనేత కార్మికుల కోసం సమ్రగ చేనేత విధానం అమల్లోకి తెచ్చామని సీఎం పేర్కొన్నారు.
 
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగు నీరందించే లక్ష్యంగా మిషన్‌ భగీరథ చేపట్టామన్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘షీ’ బృందాలు సమర్ధంగా పనిచేస్తున్నాయని సీఎం కొనియాడారు. నిరుపేద ఆడపిల్లలకు వివాహం చేసేందుకు కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేసుకునే వారికి మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ అయితే రూ.13వేలు చెల్లిస్తున్నామన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు.
 
త్వరలో 84,876 ఉద్యోగాలు
స్వతంత్ర దినోత్సవ పండుగ వేళ ముఖ్యమంత్రి  తెలంగాణలోని నిరుద్యోగ యువతపై వరాల జల్లు కురిపించారు. త్వరలో 84,876 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భవిస్తే లక్ష ఉద్యోగాలు సిద్ధిస్తాయని ఉద్యమ సమయంలో చెప్పామని ఇప్పుడు దాన్ని నెరవేర్చనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. వాటిలో ఇప్పటికే 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. తమ ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని.. ప్రజల ఆశీస్సులతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తామన్నారు.