నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

3 Oct, 2019 02:46 IST|Sakshi

రేపు ప్రధాని మోదీతో సమావేశం

బకాయి నిధుల విడుదలను కోరనున్న సీఎం 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయ న భేటీ కానున్నారు. మోదీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన్ను కేసీఆర్‌ కలుసుకోవడం ఇదే తొలిసారి. దాదాపు 10 నెలల విరామం తర్వాత ప్రధానితో సమావేశం కాబోతున్నారు. ఆర్థిక సంక్షోభం తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రధానిని కేసీఆర్‌ కలుసుకోనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్థిక సంక్షోభం తో రాష్ట్ర ఆదాయానికి వచ్చిన నష్టాలను ప్రధానికి వివరించే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. జీఎస్టీ నష్టపరిహారం, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సిన పెండింగ్‌ నిధులను కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలని మరోసారి కోరనున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్‌ హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారం మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. 

>
మరిన్ని వార్తలు