‘మందు’ ఆదాయం బహుబాగు

10 Apr, 2016 02:34 IST|Sakshi

ఎక్సైజ్ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మద్యం విక్రయాల ద్వారా రికార్డు ఆదాయాన్ని సమకూర్చడం పట్ల కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్‌ను ఆయన అభినందించారు.

2015-16 సంవత్సరంలో బడ్జెట్ అంచనాల ప్రకారం ఎక్సైజ్ శాఖ వార్షిక ఆదాయ లక్ష్యం రూ. 11,707.04 కోట్లు కాగా, అంతకు మించి రెవెన్యూ సాధించి రికార్డు సృష్టించింది. 2015 ఏప్రిల్ నుంచి మార్చి 2016 వరకు ఆబ్కారీ శాఖ 12,191.63 కోట్ల రెవెన్యూ సాధించింది. అంటే బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 104.14 శాతం లక్ష్యాన్ని సాధించింది.


దేశీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్), బీర్ల అమ్మకాల ద్వారానే రూ. 12,705.36 కోట్లు వచ్చినట్లు ఈ సందర్భంగా చంద్రవదన్ సీఎంకు వివరించారు. ఇది 2014-15తో పోలిస్తే 16.74 శాతం వృద్ధిరేటు అని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో గుడుంబా నివారణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో గుడుంబాను పూర్తిగా నిర్మూలించినట్లు వివరించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 14వేల కోట్ల లక్ష్యాన్ని కూడా ఎక్సైజ్ శాఖ దాటుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. చంద్రవదన్‌తో పాటు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి. అనిల్‌కుమార్ సైతం సీఎంను కలసి తమ శాఖ పనితీరును వివరించారు. రెవెన్యూ లక్ష్యాలను వందశాతం పూర్తి చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు