కాలినడకన..కలియదిరిగి

26 Feb, 2015 00:14 IST|Sakshi

యాదగిరికొండపైన క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలన
 హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే జరిపిన కేసీఆర్
 అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
 స్వామివారికి ప్రత్యేక పూజలు..
 
 భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బుధవారం వచ్చిన  సీఎం కేసీఆర్ ఆద్యంతం ఆలయ పరిసరాలను కలియతిరిగారు. ముందుగా హెలికాప్టర్‌లో రెండుసార్లు గుట్టపరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.  వడాయిగూడెం శివారులో హెలిపాడ్ దిగిన కేసీఆర్ తన వాహనంలో టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డిలతోపాటు అధికారులతో కలిసి ముందుగా గుట్టకింద స్వామి వారి పాదాల వద్ద తన వాహనంలోనుంచి పరిశీలించారు.
 
 తులసీ కాటేజ్, ఘాట్ రోడ్డులోని జియర్ కుటీరం, టూరిజం హోటల్ వెనకభాగంలో నిర్మిస్తున్న రెండవ ఘాట్‌రోడ్డును పరిశీలించారు. పున్నమి గెస్ట్‌హౌస్ వెనక ఉన్న అపరిశుభ్రతపట్ల అసహనం వ్యక్తం చేశారు. అక్కడినుంచి నేరుగా ఆలయంలోకి చేరుకుని సామివారిని దర్శించుకున్నారు. అనంతరం వాహన పూజల ప్రాంతం, నృసింహ కాంప్లెక్స్‌లో కల్యాణ మండపంనుంచి కొండకింద స్థలాన్ని పరిశీలించారు. గతంలో ఇక్కడికి వచ్చినపుడు పందుల స్వైర విహారం ఉండేదని, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఈఓను ప్రశ్నించారు. గుట్ట చుట్టూ కందకాలను తవ్వుతున్నామని ఆమె సీఎంకు వివరణ ఇచ్చారు.
 
 అలాగే ఆలయ మాడవీధుల నుంచి రిసెప్షన్ హాల్ పక్కన, ఏసీ గెస్ట్ హౌజ్ ముందునుంచి విష్ణుపుష్కరిణి సమీపంలో గల ఆంజనేయస్వామి ఆలయం.. అక్కడున్న పాత కాలం నాటి కల్యాణ మంటపాన్ని సందర్వించారు. ఆ తర్వాత కొండచివరి వరకు వెళ్లారు. అక్కడినుంచి కొండకింది పరిసరాలను పరిశీలించారు. పార్కుమార్గం.. పాత సంగీత పాఠశాల, శివాలయం ముందునుంచి అండాళ్ నిలయానికి చేరుకుని అక్కడ అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఆయన వెంట  జేసీ సత్యనారాయణ,  దేవాదాయ శాఖ స్థపతి సుందరరాజన్, ఆర్కిటెక్టు అధికారి ఆనంద సాయి,  దేవస్థానం రీజినల్ జాయింట్ కమిషనర్  కృష్ణవేణి, ఈఓ గీతారెడ్డి, అధికారులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు