పరీక్షలు నిర్వహించాలా.. ప్రమోట్‌ చేయాలా?

7 Jun, 2020 16:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షల నిర్వహణపై విద్యామంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య అధికారులతో సీఎం కేసీఆర్‌ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించాలా? లేదా ప్రమోట్‌ చేయాలా? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, ప్రముఖలతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్‌ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రమోట్‌ చేస్తేనే బాగుంటుందని ప్రభుత్వానికి ఇప్పటికే సూచనలు, సలహాలు అందుతున్నాయి. వాటిపై కూడా రేపటి సమావేశంలో చర్చించనున్నారు.(టెన్త్‌ పరీక్షలు మళ్లీ వాయిదా)

కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి ఎ‍క్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పరీక్షలను వాయిదా వేసి మిగతా జిల్లాల్లో నిర్వహించుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులతో చర్చించిన కేసీఆర్‌ రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని భావించి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురైయ్యారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం స్థాయిలో కీలక సమావేశం ఏర్పాటు చేసి పదో తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కరోనా నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు