కొండపోచమ్మకు గోదావరి జలాలు.. 

29 May, 2020 11:48 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌‌ను(మర్కూక్‌) సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. చినజీయర్‌ స్వామితో కలిసి ఆయన మోటార్‌ ఆన్‌ చేశారు. దీంతో కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్రని లిఖించినట్టయింది. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్‌ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్‌ దంపతుల ప్రత్యేక పూజలు)


అంతకుముందు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్ వద్ద సుదర్శన యాగం ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేసీఆర్‌ ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మర్కూక్‌ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పుర్ణాహుతిలో కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు