టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

6 Nov, 2014 01:30 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలో టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభాపక్ష నాయకుని స్థానంలో కేసీఆర్ ఆసీనులయ్యారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  అమరవీరులకు నివాళి: శాసనసభ ప్రారంభానికి ముందుగానే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న స్మారక స్థూపం నుండి శాసనసభకు కాలినడకన వచ్చారు.
 
 శాసనసభా వ్యూహరచనా కమిటీ ఏర్పాటు..
 
 శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వ్యూహ రచనా కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బుధవారం ఉదయమే సమావేశమైంది. శాసనసభా సమావేశాలున్నంత కాలం ఈ కమిటీ ఉదయం 8.30కే సమావేశమై, ఆ రోజు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా మంత్రి హరీశ్‌రావు, సభ్యులుగా మంత్రులు టి.పద్మారావు, పోచారం, కేటీఆర్, శాసనసభ్యులు కె.లక్ష్మారెడ్డి, దాస్యం వినయ్ బాస్కర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు వ్యవహరిస్తారు.
 

మరిన్ని వార్తలు