ప్రచారం.. పక్కా లోకల్‌! 

24 Oct, 2018 03:06 IST|Sakshi

ఊరి మాట చెప్పాలి.. స్థానిక అంశాలు ప్రస్తావించాలి

మారిన గ్రామాల రూపురేఖల విషయాన్ని అందరికీ గుర్తు చేయాలి 

కొత్తగా ఏర్పడిన 4,380 పంచాయతీల గురించి వివరించాలి 

చెరువుల అభివృద్ధితో గ్రామాల్లో జలకళను ప్రస్తావించాలి

అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ సూచనలు.. ప్రచార తీరుపై సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: చేసింది చెప్పాలనే నినాదంతో టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలను ఎక్కువగా ప్రస్తావించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నాలుగేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆయా గ్రామాల్లో మారిన పరిస్థితులను వివరించేలా ప్రచారం ఉండాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ హాయంలో గ్రామాల రూపురేఖలు మారాయని, అదే విషయాన్ని అందరికీ గుర్తు చేయాలని సూచించారు. ప్రతిరోజు కొన్ని నియోజకవర్గాల ప్రచార సరళిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి 48 రోజులు గడిచింది. అభ్యర్థులందరూ మొదటి రోజు నుంచి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే ఎక్కువ మంది రాష్ట్ర స్థాయిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనే ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. దీంతో గ్రామాలు, బస్తీల్లోని ప్రజలకు ఆశించిన మేర అభ్యర్థులు దగ్గర కాలేకపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచార సరళిపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఎక్కువ మంది అభ్యర్థులు స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని గుర్తించారు. దీంతో ప్రచార పర్వంలో మార్పులు చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ మంగళవారం పలువురు అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రచారంలో కొత్తగా అనుసరించే వ్యూహాలను సూచించారు. 

ఊరు మారిందని.. 
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని పోలుస్తూ ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు కేసీఆర్‌ సూచించారు. పదేళ్ల కింద వేసిన రోడ్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, వేల గ్రామాలకు రోడ్లు నిర్మించిందని, గిరిజన ఆవాసాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించామని, ఇవే విషయాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. చెరువులను అభివృద్ధి చేయడంతో గ్రామంలో వచ్చిన మార్పులను తెలియజేయాలని సూచించారు. కొత్తగా 4,380 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశామని వివరించాలని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ వంటి రాష్ట్ర స్థాయి ప్రయోజనాలను చేకూర్చే విషయాలను భారీ బహిరంగసభలో వివరిస్తామని చెప్పారు. అభ్యర్థులు అందరూ స్థానిక అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆదేశించారు.

బహిరంగ సభలపై నిర్ణయం
ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇటీవల అభ్యర్థుల సమావేశంలో ప్రకటించారు. అక్టోబర్‌ నెలాఖరులోపే వీటిని నిర్వహించేలా ఆయా జిల్లాల ముఖ్య నేతలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వరంగల్‌లో అక్టోబర్‌ 31న నిర్వహించాలని వరంగల్‌ ఉమ్మడి జిల్లా నేతలు కేసీఆర్‌ను కోరారు. ఆ తర్వాతి రోజు ఖమ్మంలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే వరుసగా మూడు రోజులు బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. బహిరంగ సభల నిర్వహణపై బుధవారం లేదా గురువారం టీఆర్‌ఎస్‌ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు