కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రండి..

15 Jun, 2019 01:35 IST|Sakshi
శుక్రవారం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ను కలసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు కేసీఆర్‌ ఆహ్వానం

ముంబై వెళ్లి స్వయంగా పిలిచిన తెలంగాణ సీఎం 

గవర్నర్‌ విద్యాసాగర్‌రావునూ ఆహ్వానించిన టీఆర్‌ఎస్‌ అధినేత 

సాక్షి, ముంబై : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకం కావడంతో ఆ రాష్ట్ర సీఎంను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణ యం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ముంబై వెళ్లారు.


కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ శుక్రవారం ముంబై రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

తొలుత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. ఈనెల 21న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి వద్ద ప్రాజెక్టు ను ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో సమావేశమయ్యా రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మీ సహకా రం మరవలేనిదని పేర్కొంటూ ఫడ్నవిస్‌ను సత్కరించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. కేసీఆర్‌ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు

మరిన్ని వార్తలు