ఔరంగజేబు కంటే కేసీఆర్ పెద్ద నియంత: టీపీసీసీ

15 Aug, 2014 09:10 IST|Sakshi
ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరంగజేబు కంటే పెద్ద నియంతలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు అధికారం కాం గ్రెస్ వేసిన భిక్షేనని.. కాంగ్రెస్ తెలంగాణ కోసం చేసిన త్యాగం వల్లే ఈ రోజు వారు పదవులు అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో దయాకర్ మీడియాతో మాట్లాడారు.
 
‘‘తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు కూడా తన రాజ్యానికి చెందిన ప్రజలను ప్రేమించాడు.. గౌరవిం చాడు. కానీ కేసీఆర్‌కు ప్రజలంటే కూడా లెక్కలేదు. ఒకే రోజు సమగ్ర సర్వే పేరుతో నియంతలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల జాతీయత, ప్రాంతీయత ఒక్కరోజులో తేల్చేస్తారా? ఆరోజు లేకుంటే మేం లెక్కలో లేనట్లేనా? ఇది ఫాసిస్టు విధానం కాదా? కనీసం 2, 3 రోజుల సమయం కూడా ఇవ్వరా? తెలంగాణ ఇంతకుముందు ఈ దేశంలో లేదా? లేక కొత్త దేశంగా ఆవిర్భవించిందా? తెలంగాణలో ఇంతకుముందు విధానాలు, నిబంధనలేమీ లేన ట్లుగా మాట్లాడుతున్నారు’’ అని  పేర్కొన్నారు.
 
రాష్ట్రానికి చేరిన సద్భావనాయాత్ర
తీవ్రవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ నెల 9న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ప్రారంభమైన రాజీవ్‌గాంధీ జ్యోతి సద్భావనా యాత్ర గురువారం రాష్ట్రానికి చేరుకుంది. యాత్రలో భాగంగా గాంధీభవన్‌కు చేరుకున్న సుమారు 200 మంది నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు షబ్బీర్‌అలీ,  తదితరులు ఘన స్వాగతం పలికారు. గాంధీభవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ చిత్రపటం ముందు సద్భావనా జ్యోతిని ఉంచి నివాళులు అర్పించారు. తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర ఏపీ, కర్ణాటక, మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా మీదుగా రాజీవ్ జయంతి రోజైన ఈ నెల 20న ఢిల్లీకి చేరుకుంటుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ జ్యోతిని అందుకుని న్యూఢిల్లీలోని వీర్‌భూమి వద్ద నివాళులు అర్పిస్తారు.
మరిన్ని వార్తలు