ఎర్రకోటకు గులాబీ బాస్‌

26 Oct, 2018 15:28 IST|Sakshi
కేసీఆర్‌ (ఫైల్‌ ఫోటో)

సీఎం కేసీఆర్‌ ఒకటి లేదా రెండో తేదీన ఖమ్మం​ పర్యటన 

 జిల్లాలో బహిరంగ సభ నిర్వహణకు స్థలాల పరిశీలన 

ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణకు ప్రణాళికలు 

సాక్షి, ప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. నవంబర్‌ ఒకటి లేదా 2వ తేదీల్లో పర్యటిస్తారని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు సమాచారం అందడంతో ఏర్పాట్లపై దృష్టి సారించారు. వాస్తవానికి ఈనెల 8వ తేదీన జిల్లాలో కేసీఆర్‌ పర్యటించాల్సి ఉంది. పర్యటన దాదాపు ఖరారై.. షెడ్యూల్‌ సైతం విడుదలైన క్రమంలో అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీపావళి పర్వదినానికి ముందే జిల్లాలో ఒకరోజు పూర్తిస్థాయి పర్యటన చేయాలని భావిస్తున్న కేసీఆర్‌ ఈ మేరకు జిల్లా నేతలకు సమాచారం అందించారు. శాసనసభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండడంతో జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

వరంగల్‌ పర్యటనతోపాటు ఖమ్మం పర్యటన ఉంటుందని, అక్టోబర్‌ 31న ఆ జిల్లాలో పర్యటిస్తే.. ఒకటో తేదీన ఖమ్మం జిల్లాకు రానున్నారని, ఒకవేళ ఆ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగితే ఒకరోజు అటు ఇటుగా ఖమ్మం జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్‌ 1, 2వ తేదీల్లో సీఎం పర్యటన ఉండే అవకాశం ఉందని.. పార్టీ నేతలు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లపై  దృష్టి సారించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించే అవకాశం ఉన్నందున సభాస్థలి అందరికీ అనువుగా, విశాలంగా ఉండే విధం గా చూడాలని భావిస్తున్న పార్టీ నేతలు.. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి టీఆర్‌ఎస్‌ తొలి ఎన్నికల సభ కావడంతో వివిధ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

సీఎం పాల్గొనే బహిరంగ సభ, పర్యటన ఏర్పాట్లపై మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇప్పటికే దృష్టి సారించారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలతోపాటు సమీప నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని యోచిస్తున్న పార్టీ నాయకత్వం ఈ మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు, ముఖ్య నేతలకు సీఎం పర్యటన ఏ క్షణంలో ఖరారైనా విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చింది. తొలుత ఖమ్మం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో సీఎం సభ ఏర్పాటు చేయాలని భావించినా.. సభా ప్రాంగణం సరిపోయే అవకాశం లేదని, జన సమీకరణకు అనుగుణంగా విశాలమైన స్థలాలను చూడాలని నేతలు భావించినట్లు సమాచారం.

నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌ సమీపంలో గల ఖాళీ స్థలంలోకానీ.. గతంలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోకానీ సీఎం సభ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌ ఏ తేదీన వచ్చినా ఒకరోజు జిల్లాలో బసచేసే విధంగా పర్యటన ఉండే అవకాశం ఉందని భావిస్తున్న నేతలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో సీఎం భేటీ కావడంతోపాటు అక్కడి రాజకీయ పరిస్థితులు, పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ నేతలు సహకరిస్తున్న తీరు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


 

మరిన్ని వార్తలు