అంచనాలకు మించి..!

4 Jun, 2019 09:25 IST|Sakshi


ఖమ్మంవైద్యవిభాగం:  జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ సత్ఫలితాలిస్తోంది. పథకం ప్రారంభంలో కొంత మందకొడిగా సాగినా.. ఆ తర్వాత అంచనాలకు మించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జ రుగుతున్నాయి. దీంతో ప్రభు త్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరినట్లయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017, జూన్‌ 2వ తేదీన కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకం ప్రారంభమై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు కలుపుకుని ప్రసవాలు అంచనాలను మించిపోతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంవత్సరానికి 5వేలకు మించి ప్రసవాలు జరగకపోయేవి.

అదే సందర్భంలో వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాదిలో ఇంచుమించుగా 22వేల వరకు ప్రసవాలు జరిగేవి. ఈ దశలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకుంటే రూ.2వేల విలువ చేసే కేసీఆర్‌ కిట్‌ను ఉచితంగా అందజేయడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు తల్లులకు ఇస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ఆశించిన లక్ష్యంకన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతుండడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకోవడం ద్వారా లభించే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.

రెండేళ్లు.. 20,306 ప్రసవాలు 
పథకం ప్రారంభమైన రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య క్రమక్రమంగాపెరుగుతూ వస్తోంది. రెండేళ్లలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలుపుకుని 20,306 ప్రసవాలు జరగడం గమనార్హం. అందుకుగాను 17,056 కేసీఆర్‌ కిట్లు ప్రసవం చేయించుకున్న మహిళలకు అందజేశారు. 22 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో కలిపి ఈ ప్రసవాలు జరిగాయి. అందులో అత్యధికంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు వంతులకుపైగా ప్రసవాలు జరగడం విశేషం. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆస్పత్రిలో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడ వైద్యులు ప్రతి రోజు 25 నుంచి 30 వరకు ప్రసవాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏడాది కాలంలో 20,306 ప్రసవాలు జరగగా.. ఒక్క జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే 16,717 ప్రసవాలు జరగడం విశేషంగా చెప్పొచ్చు. 

నగదు కోసం ఎదురుచూపులు 
అయితే.. జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం విజయవంతమైనప్పటికీ ఆ పథకం కింద అందించే నగదు విషయంలో లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. గత 9 నెలలుగా నగదు అందక లబ్ధిదారులు ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మహిళ గర్భవతి అయిన 5 నెలల్లోపు ప్రభుత్వ ఆస్పత్రిలో రెండుసార్లు పరీక్ష చేయించుకొని.. నమోదు చేయిస్తే మొదటి విడత రూ.3వేలు చెల్లిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన వెంటనే కేసీఆర్‌ కిట్‌తోపాటు రెండో విడత ఆడపిల్ల పుడితే రూ.5వేలు, మగపిల్లాడు పుడితే రూ.4వేలు చెల్లిస్తారు.

ఇమ్యూనైజేషన్‌ మూడు డోసులు నాలుగు నెలల్లో పూర్తి చేస్తే మూడో విడత రూ.2వేలు చెల్లిస్తారు. బిడ్డపుట్టి 9 నెలలు పూర్తయ్యాక నాలుగో విడతగా రూ.3వేలు చెల్లిస్తారు. బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా విడతలవారీగా నగదు చెల్లిస్తారు. అయితే జిల్లాలో మొదటి విడతలో 8,417, రెండో విడతలో 4,742, మూడో విడతలో 8,879, నాలుగో విడతలో 7,119 మంది లబ్ధిదారులకు  చెల్లింపులు జరపాల్సి ఉంది. వీరంతా తిమ్మిది నెలలుగా ఎప్పుడు డబ్బులు బ్యాంక్‌ అకౌంట్‌లో పడతాయా.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.  

నగదు అందుతుంది.. 
కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా లబ్ధిదారులందరికీ నగదు తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరు బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ అందజేయాలి. పథకం ద్వారా రెండేళ్లలో గణనీయంగా ప్రసవాలు జరిగాయి. ఇది అందరి కృషితోనే సాధ్యమైంది. జిల్లాలోని గర్భిణులు ప్రతి ఒక్కరు కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలి.  – డాక్టర్‌ కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు