కోటి మంది బాబులనైనా ఎదుర్కొంటాం

12 Jun, 2015 06:45 IST|Sakshi
గురువారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. సభకు హాజరైన జనం

మహబూబ్‌నగర్ జిల్లా కరువును తీరుస్తాం: సీఎం కేసీఆర్
ఎవరడ్డుపడినా కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టును కట్టించి తీరుతా
తల తాకట్టు పెట్టయినా నాలుగేళ్లలో పూర్తి చేస్తాం
పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ
తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ధ్వజం
ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే కుటుంబానికో ఉద్యోగం
అనువైన ప్రాంతంలో వ్యవసాయ భూమి, డబుల్‌బెడ్రూం ఇళ్లు
కర్ణాటకతో మాట్లాడి ఆర్డీఎస్‌ను దగ్గరుండి పూర్తి చేయిస్తానని వెల్లడి
 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కోటిమంది చంద్రబాబులు కొంగజపం చేసినా.. హరిహర బ్రహ్మాది రుద్రాదులు అడ్డుపడ్డా పాలమూరు ప్రాజెక్టును అనుకున్న సమయానికి నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శపథం చేశారు. పాలమూరు ప్రజలకు పట్టెడన్నం పెట్టడానికి ఎత్తిపోతల పథకాన్ని తాను తీసుకొస్తే అనుమతి ఎవరిచ్చారంటూ ఓ ఆంధ్రా మంత్రి నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు.

ఏపీలో పొతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కండలేరు, వెలిగొండ, పట్టిసీమ ప్రాజెక్టులను ఎవరి అనుమతితో కట్టారని ప్రశ్నించారు. లేనిపోని వంకర మాటలతో, చేతలతో తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే ఖబడ్దార్ జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వెనలో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు.

అనంతరం అక్కడే నిర్వహించిన సభలోనూ, తర్వాత భూత్పూరులో జరిగిన భారీ బహిరంగసభలోనూ కేసీఆర్ మాట్లాడారు. అవసరమైతే తన తల తాకట్టు పెట్టయినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తానని.. పాలమూరుకు నీళ్లు రావడం కలేనని అపహాస్యం చేసిన వారికి చెంపపెట్టులా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన చేపడతామని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును తానే స్వయంగా కుర్చీ వేసుకొని కూర్చొని కట్టించి తీరుతానన్నారు. అహోరాత్రులు శ్రమించి ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును తానే డిజైన్ చేయించానని చెప్పారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమ బెదిరిస్తున్నారని, నరేంద్రమోదీ ఆంధ్రా రాష్ట్రానికే ప్రధాని కాదని, ఆయన తమకూ ప్రధానే అని వ్యాఖ్యానించారు. దీన్ని అడ్డుకోడానికి ఎన్ని కుక్కలు ప్రయత్నం చేసినా న్యాయంవైపే కేంద్రం ఉంటుందన్నారు. చంద్రబాబు ఏనాడూ తెలంగాణ అభివృద్ధిని కోరుకోలేదని.. ఇప్పుడూ అడ్డుపడుతున్నారని విమర్శించారు. పాలమూరు కరువు తీరేలా, జిల్లాలో సిరులు కురిసేలా, వలసలకు స్వస్తి పలికేలా రూ. 35,200 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టినట్లు కేసీఆర్ వివరించారు.

వట్టెం, కర్వెన ప్రాంతాల్లో రెండేళ్లలోపే సాగునీటిని అందిస్తామన్నారు. ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని.. అవసరమైతే ఇక్కడే విశ్రాంతి భవనం నిర్మించుకుని 15 రోజులకోసారి వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల వల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కరువు తీరుతుందన్నారు. తెలంగాణకు జలవనరులపై ఉన్న హక్కును ఇంచు కూడా వదులుకోబోమని, ఆర్‌డీఎస్‌పై మళ్లీ దృష్టి పెడతామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆర్‌డీఎస్ కట్ట దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టును పూర్తిచేయిస్తానని సీఎం పేర్కొన్నారు.
 
‘పాలమూరు’కు కురుమూర్తి దేవుడి పేరు
పాలమూరు ప్రాజెక్టు పరిధిలో మూడు తండాలు ముంపునకు గురవుతున్నాయని, ఆ కుటుంబాలను ప్రభుత్వం కంటికి రెప్పలాగా చూసుకుంటుందన్నారు. వారికి అవసరమైన చోట దిగువ ఆయకట్టు ప్రాంతంలో ఎంత ఖర్చయినా సరే భూములను కొనివ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ చెప్పారు. అలాగే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని.. ప్రాజెక్టు పనులు ప్రారంభించేలోపే వారికి తొలి వేతనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. డబుల్‌బెడ్రూం ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామన్నారు.

భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే తండావాసులతో తానే సమావేశమవుతానన్నారు. నిర్వాసితుల వివరాలను సేకరించే పని, ఉద్యోగాలు ఇప్పించే పని తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తానని చెప్పారు. వచ్చే మార్చి నుంచి రైతులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పగటిపూటే కరెంటు ఇచ్చి తీరుతామన్నారు. మహబూబ్‌నగర్ ప్రజల ఆరాధ్యదైవంగా భావించే కురుమూర్తి దేవుడి పేరును పాలమూరు ప్రాజెక్టుకు పెడుతున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హేమసముద్రంలో 10 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టును త్వరలో చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు