అమాత్య యోగం ఎవరికో?

27 Dec, 2018 02:30 IST|Sakshi

కేసీఆర్‌ కేబినెట్‌పై సర్వత్రా ఆసక్తి

నేడు హైదరాబాద్‌కు రానున్న సీఎం

మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ భేటీపై దృష్టి

సామాజిక లెక్కలు, ఉమ్మడి జిల్లా కోటాపై మదింపు

మంత్రి పదవుల ఆశావహుల ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలనే విషయంలో ఒకటికి రెండుసార్లు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. సామాజిక లెక్కలు, ఉమ్మడి జిల్లాల వారీగా సమీకరణలను బేరీజు వేస్తున్నారు. మరోవైపు ఫెడరల్‌ ఫ్రం ట్‌తో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పాల నా పరంగా ఇబ్బంది లేకుండా ఆయన తన కొత్త బృందంలోని సభ్యులను ఎంపిక చేసుకునే యోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సీఎం తన ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీ పర్యటనలను ముగించుకుని గురువారం హైదరాబాద్‌కు వస్తున్నారు. శుక్రవారం నుంచి ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఢిల్లీ పర్యటన ఒకరోజు పొడిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత కేబినెట్‌ విస్తరణ చేయాలా.. అసెంబ్లీని సమావేశపరచి స్పీకర్‌ ఎన్నిక జరపాలా అనే విషయంలో ఆయన ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తే స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవుల భర్తీ పూర్తవుతాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ లో సమీకరణలు మరింత సులభం కానుందని సీఎం భావిస్తున్నారు. జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్న దృష్ట్యా ఆలోపే మంత్రివర్గ విస్తరణతోపాటు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉంది. 

మినీ కేబినెట్‌..
రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో 18 మందితోనే మంత్రివర్గం ఉండాలి. సీఎంగా కేసీఆర్, తొలి మంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణస్వీకారం చేశారు. ఇక మరో 16 మందికి అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల వరకు తక్కువ మందితోనే మంత్రివర్గాన్ని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మరో 8 లేదా 10 మందికి అవకాశం దక్కవచ్చని సమాచారం. ఇలా చేస్తే ఓసీలలో నలుగురు, బీసీలలో ఇద్దరు... ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరు వంతున కేబినెట్‌లో ఉండనున్నారు. 

శాసనసభ సిద్ధం...
కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమానికి అనుగుణంగా శాసనసభ సిద్ధమైంది.అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే కార్యక్రమం నిర్వహించేలా అసెంబ్లీ అధికార యంత్రాంగం సిద్ధమైంది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్‌ ఎన్నికకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో అసెంబ్లీ మొత్తం కొత్త శోభను సంతరించుకుంది. రంగులు వేయడంతోపాటు విద్యుద్దీకరణ మరమ్మతులను పూర్తి చేశారు. సాంకేతికంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

స్పీకర్‌గాఎవరు?
కొత్త ప్రభుత్వంలో స్పీకర్‌ పదవి ఎవరిని వరించనుందనేది టీఆర్‌ఎస్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ పదవి చేపట్టిన వారు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావనల నేపథ్యంలో దీనిపై ఎవరూ ఆసక్తి చూపడంలేదు.అంతర్గతంగా ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా సీఎం కేసీఆర్‌ తీసుకునే నిర్ణయంపై ఎవరు అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీలో బీసీ వర్గానికి స్పీకర్‌ పదవికి కేటాయించినందున ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేరును సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు.అలాగే సీనియర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, డి.ఎస్‌.రెడ్యానాయక్‌ పేర్లను ఈ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు