రాష్ట్రాభివృద్ధిలో ఐటీ పాత్ర భేష్‌

19 Feb, 2019 02:36 IST|Sakshi
15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

15వ ఆర్థిక సంఘం ప్రశంస 

తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి 

4 జిల్లాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతం 

మిగిలిన జిల్లాలు వెనకబడ్డాయి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో ఇన్‌ఫర్మేషన్, టెక్నాలజీ(ఐటీ) రంగం కీలకపాత్ర పోషిస్తోందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. దేశ ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో 10 శాతానికిపైగా వాటా రాష్ట్రానిదేనని కొనియాడింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె సింగ్, సభ్యులు అశోక్‌ లహరి, అనూప్‌సింగ్, రమేశ్‌చంద్‌లతో కూడిన బృందం సోమవారం తొలిరోజు ఇక్కడ పారిశ్రామిక, కార్మిక సంఘాలు, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల ప్రతినిధులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ ఆధారితం(జీఎస్‌వీఏ–ప్రస్తుత ధరలు)లో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగ పరిశ్రమల(తృతీయ రంగాని)దే సింహభాగం వాటా అని పేర్కొన్నారు. తృతీయ రంగ జీఎస్‌వీఏ(ప్రస్తుత ధరలు) విషయంలో కర్ణాటక(66.27) తర్వాత తెలంగాణ (63.80) రెండోస్థానంలో ఉందని తెలిపారు. ద్వితీయ రంగానికి సంబంధించిన తెలంగాణæ జీఎస్‌వీఏ(ప్రస్తుత ధరలు) అంకెలు దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యల్పమని అభిప్రాయపడ్డారు.

తయారీ, మైనింగ్, విద్యుత్‌ తదితర రంగాల పరిశ్రమలు ద్వితీయ రంగం పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర తయారీ రంగంలో ఔషధ, సిమెంట్, గ్రానైట్, విద్యుత్‌ ఉపకరణాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి పరిశ్రమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఐటీ, ఐటీ ఆధారిత రంగ పరిశ్రమలపైనే రాష్ట్రం పూర్తిగా ఆధారపడకుండా, తయారీ రంగ పరిశ్రమల వృద్ధికి సైతం కృషి చేయాలని సూచించారు. ఒకే రంగంపై పూర్తిగా ఆధారపడితే వృద్ధికి ముప్పు ఏర్పడే అవకాశాలుండడంతో ఇతర రంగాల్లో సైతం పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. తలసరి ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు మాత్రమే రాష్ట్ర సగటు కంటే ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలు ఎక్కువ ఉండడంతో ఈ నాలుగు జిల్లాలు వృద్ధి సాధించాయని, మిగిలిన జిల్లాలు వెనకబడ్డాయని తెలిపారు. సింగిల్‌ విండో విధానంలో పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీకి టీఎస్‌–ఐపాస్‌ చట్టం, మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ–హబ్‌ ఇంక్యూబేటర్‌ ఏర్పాటు, కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కు నిర్మాణం తదితర పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలను ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుంది. యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ(టాస్క్‌) ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించింది. 

స్థానిక సంస్థలకు విస్తృతంగా నిధులివ్వాలి 
స్థానిక సంస్థలకు విస్తృతంగా నిధులు ఇవ్వాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లలో మునిసిపల్‌ కార్పొరేషన్లు తమ మొత్తం ఆదాయంలో 65 శాతాన్ని సొంతంగా ఆర్జించాయని, మునిసిపాలిటీల సొంత ఆదాయం 52 నుంచి 65 శాతానికి, నగర పంచాయతీల సొంత ఆదాయం 52 నుంచి 68 శాతానికి పెరిగిందని ప్రభుత్వం నివేదించింది. అయితే, జిల్లా, మండల పరిషత్‌లకు సొంత ఆదాయం అత్యల్పమని పేర్కొంది. జడ్పీలు, మండల పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లే ప్రధాన వనరులని తెలిపింది. గ్రామపంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులే ఇప్పటివరకు ప్రధాన ఆదాయవనరులని తెలిపింది. గత రెండేళ్లలో 55 శాతం ఆదాయాన్ని ఇక్కడి నుంచే పొందాయని పేర్కొంది. వినోదపన్నును జీఎస్టీ పరిధిలోకి తేవడంతో మునిసిపాలిటీల ఆదాయానికి గండి పడిందని మునిసిపల్‌ ప్రజాప్రతినిధులు ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత నీటిసరఫరా, ఇతర కీలక ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
   
15వ ఆర్థిక సంఘం బృందానికి ముఖ్యమంత్రి విందు 
రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం బృందానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నగరంలోని ఓ హోటల్‌లో సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఇక పర్యటనలో భాగంగా 15వ ఆర్థిక సంఘం బృందం మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం కానుంది.  

జీఎస్టీ పరిహారం అందడం లేదు .. 
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 37.4 శాతం డీలర్లు కొత్తగా పన్నుల పరిధిలోకి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో మినహాయిస్తే ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సిన పరిహారం అందలేదని తెలిపింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో ఏపీలో జీఎస్టీ ఆదాయం 14.7 శాతం వృద్ధి చెందితే తెలంగాణలో 20 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది.  

ఆర్థిక సంఘానికి వినతులు

ప్రాధాన్యతల వారీగా నిధులు కేటాయించండి : కాంగ్రెస్‌
సాక్షి, హైదరాబాద్‌: దేశ, రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలకు ప్రాధాన్యతలవారీగా నిధులు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది. సోమ వారం ఇక్కడ 15వ ఆర్థిక సంఘం రాజకీయ పార్టీలతో నిర్వహించిన భేటీకి కాంగ్రెస్‌ తరపున సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ మేధా వుల విభాగం చైర్మన్‌ కె.శ్యాంమోహన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే  అనిల్‌ హాజరయ్యారు. కాం గ్రెస్‌ నేతలు మాట్లాడుతూ నిధులు పక్కదోవ పట్టకుండా చూడాలని, ఏ పథకానికి కేటాయించిన నిధులు దానికే ఖర్చయ్యేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యుత్‌ కేటాయింపులకే నిధులన్నీ ఖర్చు చేయాల్సి రావడంతో ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచి పోతున్నాయని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువచ్చారు. మానవాభివృద్ధి సూచీ పెరుగుదల కోసం విద్య, వైద్యం, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతివ్వాలని కోరారు. సమావేశానికి టీడీపీ తరపున రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు.  
బీజేపీ

రాష్ట్రాభివృద్ధికి సహాయం అందించండి : బీజేపీ
సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇతోధిక సహాయం అందించా లని 15వ ఆర్థిక సం ఘం చైర్మన్‌ ఎన్‌కే సిం గ్‌కు భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది.  బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచంద్రరావు, పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.మల్లారెడ్డి, అధికార ప్రతి నిధి అనుగుల రాకేశ్‌రెడ్డిలతో కూడిన బృందం  20 అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. హైదరాబాద్‌ లాంటి నగరం అభివృద్ధిపై 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయించాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణకు ఎక్కువ లాభం చేకూరుతుందని, దాని ప్రకారమే తెలంగాణకు నిధులను కేటాయించాలని కోరారు.  అప్పులు తీసుకొని అభివృద్ధి కోసం వెచ్చించకుండా పేరుప్రతిష్టలు వచ్చే వాటికి ఖర్చు చేయకుండా చూడాలని కోరారు.  

ప్రజాకర్షక పథకాలపై దృష్టి సారించాలి : సీపీఐ

ఎన్నికల్లో లబ్ధి పొందా లనే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ లు ప్రజాకర్షక విధానా లు చేపడుతున్న అంశం పై 15వ ఆర్థికసంఘం సునిశిత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సీపీఐ సూచించింది. ఇలా చేపడుతున్న ప్రజాకర్షక పథకాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నందున సమీక్షించా లని కోరింది.  ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్, ఇతర సభ్యులతో భేటీ సందర్భంగా ఆ పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు నరసింహా వినతిపత్రం సమర్పించారు.   నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు అందజేయడంతోపాటు ఏదైనా ఓ భారీ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని కోరా రు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకానికి కేంద్రం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇచ్చి చేయూతనిచ్చేలా చర్య లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు ఇవ్వండి : పంచాయతీరాజ్‌
సాక్షి, హైదరాబాద్‌: మండల, జిల్లా పరిషత్‌లకు కూడా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కేటాయించేలా సిఫారసు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌  అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదే పల్లి సిద్ధార్థ, కార్యదర్శి మధుసూదన్‌గుప్తా, అధికార ప్రతినిధి ఎం.పురుషోత్తంరెడ్డి  వినతిపత్రం సమర్పించారు. 13వ ఆర్థిక సంఘం వరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సమానంగా నిధులు కేటాయిస్తూ రాగా 14వ ఆర్థిక సంఘం  కనీస నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు.

>
మరిన్ని వార్తలు