అడవిని కాపాడాల్సిందే! 

27 Jan, 2019 07:59 IST|Sakshi
మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ‘‘జంగిల్‌ బచావో, జంగిల్‌ బడావో అనే నినాదంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలి. ఓ వైపు చెట్లు పెంచడం కోసం హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అడవులు అంతరించి పోతుంటే చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదు. అడవిని కాపాడకుంటే హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా, ఫలితం రాదు. అడవిని కాపాడే విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఇందుకోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి పనిచేయాలి. అటవీశాఖకు సాయుధ పోలీసులు అండగా నిలుస్తారు. అడవులును నరికే వారిని, స్మగ్లింగ్‌ చేసే వారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్‌ ఉంది. స్మగ్లింగ్‌ జీరో సైజుకు రావాలి.

స్మగ్లింగుకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలి’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అటవీ శాఖ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అడవుల సంరక్షణ విషయంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అటవీశాఖ అధికారులతో శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ ఎస్‌.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అటవీ శాఖ పీసీసీఎఫ్‌ పికె ఝా, అడిషనల్‌ డీజీ జితేందర్, ఐజీలు నవీన్‌చంద్, స్టీఫెన్‌ రవీంద్ర, నాగిరెడ్డి, సీసీఎఫ్‌ రఘువీర్, సీఎంఓ అధికారులు భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్‌ రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్‌ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ అడవుల నుంచి నిజామాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ వరకు సాగుతున్న జీరో దందాపై ప్రధానంగా సమీక్షించినట్లు సమాచారం.

ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన 8 మంది అటవీ శాఖ అధికారులను అరెస్టు చేయడం, మరో ఇద్దరు లా అండ్‌ ఆర్డర్‌ సీఐ, ఎస్‌ఐలను బదిలీ చేయడం వంటి సంఘటనల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి, అడవి నుంచి పూచిక పుల్ల కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయుధ పోలీసులు, అటవీ శాఖ అధికారులతో కలిసి జాయింట్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ బృందాలు అడవిలో నిరంతర తనిఖీలు నిర్వహించడంతోపాటు, అడవి నుంచి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌ఓలు కలిసి తమ జిల్లా పరిధిలో అడవుల సంరక్షణకు కావాల్సిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో అడవులు రక్షించే బాధ్యతుల నెరవేర్చాలని కోరారు.

స్మగ్లర్లపై ఉక్కుపాదం
కలప స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించడంతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా కలప స్మగ్లింగ్‌కు పాల్పడితే అందరికన్నా వారినే ముందు అరెస్టు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం గమనార్హం. ప్రభుత్వం అటవీ సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. అడవుల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న అటవీ చట్టాలను పూర్తి స్థాయిలో సమీక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, అడవులను రక్షించడం, స్మగ్లర్లను శిక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ రక్షణ కోసం కొత్త చట్టం రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పచ్చదనం పెంచే కార్యక్రమానికి నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాంపా నిధుల వినియోగంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి సమీక్ష నేపథ్యంలో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కలప దందాపై ఉక్కుపాదం మోపినట్లే. ఈ పరిణామం అధికారులతోపాటు అడవిలో దందాసాగిస్తున్న స్మగ్లర్లకు కలవరానికి గురి చేస్తోంది.

మరిన్ని వార్తలు