నేడు ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ

4 Oct, 2019 01:04 IST|Sakshi
ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌

సాయంత్రం 4:30 గంటలకు సమావేశం

కృష్ణా–గోదావరి అనుసంధాన ప్రాజెక్టుకు సాయం కోరే అవకాశం

కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డికి జాతీయ హోదా కోసం వినతి

సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ : నీళ్లు, నిధుల అంశాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి సాయంత్రం 6 గంటలకు హస్తిన చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తుగ్లక్‌ రోడ్డులోని తన అధికారిక నివాసంలో బస చేశారు. సీఎం వెంట టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు సంతోశ్‌ కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బండ ప్రకాశ్, బీబీ పాటిల్, లింగయ్య యాదవ్, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు కేసీఆర్‌ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. వాస్తవానికి శుక్రవారం ఉదయం 11 గంటలకే ఈ భేటీ తొలుత ఖరారైనా ప్రధాని షెడ్యూల్‌లో మార్పుల కారణంగా ఈ భేటీ సాయంత్రానికి మారింది.

నిధుల సాధనే లక్ష్యం...
ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్తంగా నిర్మించతలపెట్టిన కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ కేంద్ర సాయం కోరనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సైతం నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి అవసరమైన నిధులను కేంద్రమే భరించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కోరే అవకాశాలున్నాయి. అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని, ఇతర ప్రాజెక్టులకు సైతం వివిధ కేంద్ర పథకాల నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రధానిని కేసీఆర్‌ కోరనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూ. 80,500 కోట్లతో చేపట్టగా ఇప్పటికే రూ. 55 వేల కోట్ల మేర నిధులు ఖర్చయ్యాయి. ఇంకా మల్లన్నసాగర్, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికితోడు ఇప్పటికే ఉన్న రెండు టీఎంసీలకు అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేలా పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అదనంగా మరో రూ. 24 వేల కోట్ల మేర ఖర్చు కానుంది. ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చినా లేక కేంద్ర సాయం అందించినా దాన్ని త్వరితగతిన పూర్తి చేయొచ్చనేది ప్రభుత్వ అభిమతం. ఇక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 35,200 కోట్లతో చేపట్టగా దాని వ్యయం ప్రస్తుతం రూ. 52 వేల కోట్లకు చేరింది. ఇందులో ఇప్పటివరకు రూ. 6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందుతున్నది తెలంగాణ వినతిగా ఉండనుంది.

మాంద్యం దెబ్బపై వివరణ...
సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద మొత్తంగా పదకొండు ప్రాజెక్టులను గుర్తించగా ఇందులో దేవాదులకు సంబంధించి రావాల్సిన రూ. 501 కోట్లలో నెల కిందట రూ. 205 కోట్లు వచ్చాయి. మరో రూ. 296 కోట్లు అందాల్సి ఉంది. దీంతోపాటే ఏఐబీపీ పరిధిలోని భీమా ఎత్తిపోతల పథకానికి మరో రూ. 22 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలపై ప్రధానికి ముఖ్యమంత్రి విన్నవించే అవకాశం ఉంది. దీంతోపాటే ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదు. ప్రాజెక్టు కింద నిర్ణయించిన ఆయకట్టు, నీళ్లు అందుతున్న ఆయకట్టుకు మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉంది. దీన్ని పూడ్చేందుకు కేంద్రం క్యాడ్‌వామ్‌ పథకం చేపట్టాలని నిర్ణయించి తెలంగాణ నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులకు రూ. 1,000 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. దీనిపైనా ముఖ్యమంత్రి విన్నవించే అవకాశం ఉంది. దేశంలోని ఇంటింటికీ రక్షిత మంచినీటి సదుపాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్‌ ప్రాజెక్టును చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిషన్‌ భగీరథకు జలశక్తి అభియాన్‌ కింద నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరనున్నట్లు తెలిసింది. మరోవైపు ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పథకాల కింద రావాల్సిన నిధులకు కోతపడింది. మాంద్యం కారణంగా రాష్ట్ర ఆదాయం సైతం తగ్గిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిధులకు కొరత ఏర్పడింది. రాష్ట్రంలో కొత్త పనులు చేపట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. ఈ పరిస్థితులను ప్రధానికి వివరించి రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరే అవకాశం ఉంది.

జోనల్‌ ఉత్తర్వుల సవరణపై...
రాష్ట్రంలో ములుగు, నారాయణపేట్‌ జిల్లాలు కొత్తగా ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి మార్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు మార్పులకు అనుగుణంగా జోనల్‌ ఉత్తర్వులను సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి సహకరించాలని ప్రధానిని కోరనున్నారు. పాత 10 జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను కేంద్రం కేటాయిస్తోంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు నిధుల కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం హామీల మేరకు రాష్ట్రంలో ఐఐఎం, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలను నిర్మించాలని సైతం కోరనున్నారు.  

>
మరిన్ని వార్తలు