మనకు మనమే పోటీ

10 Jan, 2020 01:57 IST|Sakshi
గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీ్జలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల సమావేశంలో సీఎం కేసీఆర్‌

మున్సిపోల్స్‌లో వందకు వంద శాతం మనమే గెలవాలి

తిరుగుబాటు అభ్యర్థులను కలుపుకొని పనిచేయండి

వారికి నామినేటెడ్‌ పదవులు.. ఇతరత్రా అవకాశాలిస్తామనండి

రెబెల్స్‌ పార్టీ జెండా, నేతల ఫొటోలు వాడితే కఠిన చర్యలు

ఎమ్మెల్యేల చేతికి ఏ, బీ ఫారాలు, ‘విప్‌’ అధికారమూ వారికే

షెడ్యూల్‌ను అధ్యయనం చేయవా.. అంటూ మంత్రి మల్లారెడ్డికి క్లాస్‌

సాక్షి, హైదరాబాద్‌:   ‘మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలుకుని గెలుపు బాధ్యత అంతా పార్టీ ఎమ్మెల్యేల భుజస్కంధాలపైనే పెడుతున్నాం. మున్సిపల్‌ ఎన్నికల్లో మనకు మనమే పోటీ.. వందకు వంద శాతం మనమే విజయం సాధించాలి. క్షేత్ర స్థాయిలో అందరూ మన పార్టీలోనే ఉన్నారు. టికెట్ల కోసం పోటీ ఉన్నా.. అందరినీ కలుపుకుని బుజ్జగింపు ధోరణిలో పనిచేయండి. పోటీ అవకాశం దక్కని వారికి స్థానికంగా మార్కెట్, దేవాలయ కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పండి. ముఖ్యులెవరైనా ఉంటే త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే కార్పొరేషన్‌ పదవుల భర్తీలో డైరెక్టర్లుగా, ఇతరత్రా అవకాశాలు ఇస్తామని చెప్పండి. తిరుగుబాటు అభ్య ర్థులను బుజ్జగించడంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి..’అని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ చార్జీలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ చార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్‌ గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘మంత్రి హరీశ్‌ ఇటీవల చెప్పినట్లు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా పోటీ చేస్తూ పార్టీ జెండా, నేతల ఫొటోలను వాడితే కఠినంగా వ్యవహరించండి. భవిష్యత్‌లో మళ్లీ వారిని పార్టీలోకి తీసుకునే అవకాశం ఉండదనే విషయాన్ని స్పష్టంగా చెప్పండి’అని కేసీఆర్‌ అన్నారు.

14వ తేదీలోగా బీ ఫారాల జారీ..
‘నామినేషన్ల దాఖలు ప్రక్రియలో అత్యంత కీలకమైన ఏ, బీ ఫారాలు నింపడంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అవసరమైతే నామినేషన్‌ పత్రాలు, ఏ, బీ ఫారాలు నింపడంలో అనుభవమున్న న్యాయవాదుల సాయం తీసుకోండి. నామినేషన్ల దాఖలుకు పదో తేదీ (శుక్రవారం) చివరి గడువు కావడంతో.. గడువులోగా ఏ ఫారాలను స్థానిక మున్సిపల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అప్పగించండి. ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉన్న నేపథ్యంలో, ఆలోగా బీ ఫారాలను పార్టీ అభ్యర్థులకు జారీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను కూడా పక్కాగా నిర్వహించండి. ఏ, బీ ఫారాల సమర్పణ ప్రక్రియను ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవాలి’అని కేసీఆర్‌ సూచించారు.

గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీ్జలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

కొత్త కౌన్సిలర్లకు విప్‌ జారీ చేసే అధికారమూ ఎమ్మెల్యేలకే..
సీఎం కేసీఆర్‌తో సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఏ, బీ ఫారాలను అందజేశారు. అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేసే అధికారాన్ని అప్పగిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ సంతకంతో కూడిన ఏ ఫారాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఇదిలాఉంటే ఈ నెల 25న మున్సిపల్‌ ఫలితాల వెల్లడి, చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు విప్‌ జారీ చేసే అధికారాన్ని కూడా ఎమ్మెల్యేలకు అప్పగిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. మున్సిపాలిటీల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుల హోదాలో ఓటు హక్కు కలిగిన పార్టీ ఎమ్మెల్సీలు ఈ నెల 25న అందుబాటులో ఉండాలని, పార్టీ ప్రధాన కార్యదర్శులు కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌కు చేరుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పురోగతిపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతానికి పైగా కౌన్సిలర్, కార్పొరేటర్‌ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్పష్టత రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌ దూరంగా ఉంటారని, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సంబంధించిన ప్రచార షెడ్యూల్‌పై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నువ్వేం మంత్రివి.. మీకు క్షమశిక్షణ అవసరం లేదా?
ఈ నెల 25న ఫలితాలు వెలువడిన తర్వాత మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక ఉంటుందా అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమావేశంలో సందేహాన్ని లేవనెత్తారు. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ ‘నువ్వేం మంత్రివి, నీ కింద పర్సనల్‌ సెక్రటరీ, అధికారులు ఎంతో మంది ఉంటారు. షెడ్యూల్‌ను అధ్యయనం చేయవా, అర్థం చేసుకుని ఎమ్మెల్యేలకు మార్గదర్శనం చేయాల్సింది పోయి నువ్వే సందేహాలు అడుగుతున్నవా..’అని క్లాస్‌ తీసుకున్నారు. కాగా గురువారం ఉదయం 10 గంటలకు తెలంగాణభవన్‌లో సమావేశం ఉంటుందని పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం అందించగా, సీఎం కేసీఆర్‌ ఉదయం 10.35కు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం ఆలస్యంగా వస్తారనే ఉద్దేశంతో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు 11 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి రావడంతో ‘మీకు క్రమశిక్షణ అవసరం లేదా’అని కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగే వింగ్స్‌ ఇండియా 2020 కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్‌ సమావేశం మధ్యలో వెళ్లిపోయారు. సమావేశం ముగిసిన తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిశారు.

మరిన్ని వార్తలు