ఆర్నెల్లలో పల్లెలన్నీ మారాలి

12 Jun, 2019 01:31 IST|Sakshi
మంగళవారం ప్రగతిభవన్‌లో జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లిలా కావాలి: కేసీఆర్‌

పచ్చదనం, పరిశుభ్రతతో వర్ధిల్లాలి

గ్రామాలను అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది

సత్ఫలితాలు సాధించే జెడ్పీలకు రూ. 10 కోట్ల అభివృద్ధి నిధి

పంచాయతీరాజ్‌ ఉద్యమానికి పునర్వైభవం రావాలి

జెడ్పీలకు రాజ్యాంగబద్ధ అధికారాలన్నీ కట్టబెడతాం 

పదవి వచ్చాక లేనిపోని దర్పం తెచ్చుకోవద్దు

ఓపికగా, సావధానంగా ప్రజా సమస్యలు వినండి

కొత్త జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లకు సీఎం దిశానిర్దేశం

ప్రగతి భవన్‌లో వారితో భేటీ... పేరుపేరునా అభినందన

త్వరలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడి

గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయతీరాజ్‌ చట్టం చాలా కఠినంగా ఉంది. కార్యదర్శి చక్కగా పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తేనే మూడేళ్ల తరువాత ఆయన సేవలను క్రమబద్ధీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శులపై పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, అజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆరు నెలల్లో పూర్తి మార్పు కనబడాలి.  

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘స్థానిక సంస్థలు చాలా కాలం పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తితో పనిచేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా ఉండేది. దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్ర వాతావరణం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గ్రామాల్లో మంచిగా ఏదీ జరగడం లేదు. పల్లెలు పెంటకుప్పల్లాగా తయారయ్యాయి. ఎందుకీ క్షీణత? మంచినీళ్లకు గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు....గ్రామాల్లోనే ఉంది. గ్రామాలను మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. మీరంతా విద్యాధికులు. పరిస్థితులను అర్థం చేసుకోండి. మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. భయంకరమైన గ్రామాల పరిస్థితులలో ఆరు నెలల్లో మార్పు రావాలి. అది గుణాత్మకమైన మార్పు కావాలి’’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లతో సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్‌ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను ముఖ్యమంత్రి కూలంకషంగా వివరించారు.


మంగళవారం ప్రగతి భవన్‌లో కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్‌పర్సన్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్ధిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ‘‘నేను స్వయంగా పంచాయితీరాజ్‌ విషయంలో అవగాహనకు రావడానికి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్‌ఐఆర్డీలో శిక్షణకు వెళ్లా. అక్కడే హాస్టల్‌లో ఆరు రోజులుండి ఏడు రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యా. అప్పుడు నాకు పూర్తి అవగాహన వచ్చింది. మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరంతా జూలైలో పదవీబాధ్యతలు స్వీకరించేలోగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకోవాలి. ఇందుకోసం అధికారులు ఒక కోర్సు తయారు చేస్తారు’’అని సీఎం తెలిపారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందు సీఎం కేసీఆర్‌... జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లను వారి స్థానాల దగ్గరకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించారు. వారితో కలసి భోజనం చేశారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, ఎ. జీవన్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు ఎం. సుధీర్‌రెడ్డి, నల్లాల ఓదేలు, ఉమా మాధవరెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లతో భేటీలో కేసీఆర్‌ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే... 

బాగా పనిచేస్తేనే క్రమబద్ధీకరణ... 
గ్రామ పంచాయితీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయతీరాజ్‌ చట్టం చాలా కఠినంగా ఉంది. కార్యదర్శి చక్కగా పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తేనే మూడేళ్ల తరువాత ఆయన సేవలను క్రమబద్ధీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శులపై పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోలతో బాగా పని చేయించాలి. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, యాజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆరు నెలల్లో పూర్తి మార్పు కనబడాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్‌ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలి. ఏ జిల్లా పరిషత్‌ అగ్రభాగాన నిలిస్తే ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి రూ. 10 కోట్లు మంజూరు చేస్తాం. ఒకటి కంటే ఎక్కువ పరిషత్‌లు ముందు నిలిస్తే వాళ్లకూ మంజూరు చేస్తాం. 32 జిల్లాలు కూడా అగ్రభాగాన నిలిచి మొత్తం అందరూ కలసి రూ. 320 కోట్లు పొందాలని నా కోరిక. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లకు కొత్త కార్లు కొనిస్తాం. మీరు చాలా మంచి మార్పు తీసుకు రాగలమని ప్రజల్లో భావన తీసుకు రాగలిగితే అంతకన్నా గొప్ప లేదు. ప్రజల్లో బాగా తిరిగి పంచాయతీరాజ్‌ సంస్థను బలోపేతం చేయాలి. క్రియాశీలకంగా ఏ గ్రామానికి ఆ గ్రామమే అభివృద్ధి జరగాలంటే మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు నాయకత్వం వహించాలి. మీ కింది వారికి స్ఫూర్తి కావాలి. ఎలాగైతే తెలంగాణ సాధించామో అలాగే గ్రామాల అభివృద్ధి జరగాలి. 

లేనిపోని దర్పం తెచ్చుకోకండి... 
జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మీరు పనిచేయబోయే ఈ ఐదేళ్ల కాలంలో మంచి పేరు తెచ్చుకోవాలి. మీకు పనిచేసే ధైర్యాన్ని, అభినివేశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. మీరింకా ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షిస్తున్నా. మీకు లభించిన పదవిని ఎంత గొప్పగా నిలబెట్టుకుంటే అంత మంచిది. ఎవరూ పుట్టినప్పుడు అన్నీ నేర్చుకోలేదు. పరిస్థితులను బట్టి నేర్చుకుంటూ పోతారు. మనిషి చివరి శ్వాస విడిచే వరకు జ్ఞాన సముపార్జన చేసుకుంటూ పోవాలి. మన జీవితం చాలా చిన్నది. ఆ కాస్త సమయంలోనే మంచి పేరు తెచ్చుకోవాలి. అజ్ఞాని ఏ రోజైనా జ్ఞాని కాగలుగుతాడు. కానీ మూర్ఖుడు జ్ఞాని కాలేడు. వాడు తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు. అలా కాకుండా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్న వారే ఎంచుకున్న రంగంలో ముందడుగు వేయగలరు. అన్ని విషయాల్లాగానే పంచాయతీరాజ్‌ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి.

పదవి వచ్చిన తరువాత మన సహజత్వాన్ని కోల్పోకూడదు. అలా చేస్తే జనం నవ్వుతారు. లేనిపోని దర్పం తెచ్చుకోకూడదు. పదవి రాగానే మీరు మారిపోకూడదు. మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. పెట్టుడు గుణాల కంటే పుట్టుడు గుణం మంచిది అంటారు పెద్దలు. మన వ్యవహార శైలే మనకు లాభం చేకూరుస్తుంది. ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వారు ఆ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తారు. నాయకుల మంచి లక్షణం ఒకరు చెప్పింది వినడం. అదే మీరు చేయండి. ఓపికగా వారి సమస్యలను సావధానంగా వినండి. వాళ్లను కూర్చోబెట్టి మర్యాద చేయండి. అప్పుడే వాళ్లకు రిలీఫ్‌ వస్తుంది. ఆ తరువాత వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రయత్నం చేయండి. సహజత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తే మంచి పేరు వస్తుంది. మంచిపేరుతోనే ఉన్నతస్థాయి వస్తుంది. మీరంతా మీ సామర్థ్యాన్ని, అదృష్టాన్నిబట్టి ఈ పదవుల్లోకి వచ్చారు. ఇదంతా మీ సత్త్రవర్తన వల్లే. మంచి పనులు చేయడానికి పెట్టుబడులు అవసరం లేదు. సరళంగా మాట్లాడటమే ఏ రోజునైనా మనకు పెట్టని కోట. ప్రజాసమస్యలపట్ల ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. దీనివల్ల మనకు ఇంకా ఉన్నతావకాశాలు వస్తాయి. విజయాలు, అపజయాలు సర్వసాధారణం. కానీ రాజకీయాల్లో ఉన్న వారు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండటం ప్రాథమిక లక్షణం. 

జెడ్పీలకు రాజ్యాంగబద్ధ అధికారాలన్నీ కట్టబెట్టుతాం... 
గతంలో జెడ్పీ చైర్‌పర్సన్లకు పెద్దగా పనిలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కలిసినప్పుడు మన వ్యవస్థ గురించి వివరించా. ఇక్కడ జెడ్పీ చైర్‌పర్సన్లకు మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ రాంక్‌ ఇచ్చామని చెప్పా. వాళ్లు ఇక ముందు క్రియాశీలకంగా పని చేస్తారని కూడా చెప్పా. అవసరమైన సాయం చేస్తామని ఆర్థిక సంఘం అధ్యక్షుడు మాట ఇచ్చారు. ఏ విధంగానైనా మీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆలోచన చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అన్ని అధికారాలు సంక్రమింప చేస్తాం. ఇంత ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ రాలేదు. దాంతోపాటే మీకు బరువు, బాధ్యతలు పెరిగాయి. మీ పాత్ర ఉన్నతంగా ఉండాలి. జిల్లా పరిషత్‌లు క్రియాశీలకం కావాలి. మీ విధులు, బాధ్యతలు పటిష్టం కావాలి. 

పంచాయతీరాజ్‌ ఉద్యమం అలా మొదలైంది... 
పంచాయతీరాజ్‌ ఒక అద్భుతమైన ఉద్యమం. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దీనికి రూపకల్పన చేశారు. రాష్ట్రాలకు పాలనలో స్వతంత్రత ఉండాలని, అది వికేంద్రీకరణ జరగాలని స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. కేంద్రీకృత పాలన క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలని ఒక అద్భుతమైన ఉద్యమానికి ప్రాణం పోశారు. దీని మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్న తొలినాళ్లలో అమెరికా వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ఐసన్‌ హోవర్‌ ఆయనకు ఎస్కే డేను పరిచయం చేశారు. ఆయన భారతీయుడని, గ్రామీణ అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, అవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని నెహ్రూకు ఐసన్‌ హోవర్‌ చెప్పారు. ఆయన్ను అమెరికా అధ్యక్షుడు పొగడటంపట్ల సంతోషం వ్యక్తం చేసిన నెహ్రూ... భారత్‌కు రమ్మని ఎస్కే డేను ఆహ్వానించారు. ప్రథమ పంచవర్ష ప్రణాళికలో దేశ అవసరాలకు భిన్నంగా సత్వర పారిశ్రామీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం తనకు అభ్యంతరమని, అది తప్పని, మొదలు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని డే సూచించారు. నెహ్రూ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు.

నెహ్రూ స్వదేశానికి వచ్చాక మంత్రి మండలిలో, పార్టీలో ఎస్కే డే సలహాపై చర్చించారు. ఫలితంగా రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతాక్రమం మారింది. ఆధునిక దేవాలయాల పేరిట భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అప్పటి ఆ మార్పు వల్ల ఈ రోజున ఆహార రంగంలో స్వావలంబన వచ్చింది. నెహ్రూ తీసుకువచ్చిన మార్పు వల్ల సంతోషించిన ఎస్కే డే భారత్‌ రాగా ఆయన్ను తక్షణమే రాజ్యసభ సభ్యుడిని చేసి కేబినెట్‌ మంత్రిగా నెహ్రూ నియమించారు. ఆయనకు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ శాఖను కేటాయించారు. గ్రామీణ భారతాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన వెంటనే కార్యక్రమం మొదలుపెట్టారు. సరాసరి హైదరాబాద్‌ వచ్చి ఎన్‌ఐఆర్డీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచే యావత్‌ భారత దేశానికి పంచాయతీరాజ్‌ ఉద్యమాన్ని విస్తరింప చేశారు. అప్పట్లో ఆయన దేశంలోనే మొట్టమొదటి సమితి (పటాన్‌చెరు) అధ్యక్షుడిగా పి. రామచంద్రారెడ్డిని నియమించారు. అలా మొదలైంది పంచాయితీరాజ్‌ ఉద్యమం. 

గ్రామీణ తెలంగాణ బాగు కోసం పనిచేయండి... 
మన ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన పింఛన్, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రజాదరణ పొంది ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమయ్యాయి. అందుకే వాళ్ల రుణం మనం తీర్చుకోవాలి. దీనికి పాత్రధారులు మీరే. మండలాధ్యక్షులను మీలాగే తయారు చేయండి. నాలాగా మీరు కూడా వారికి అవగాహన కలిగించాలి. మీరు సందేశాత్మకంగా మాట్లాడాలి. ఆ స్థాయి రావడానికే మీకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ఏ ఉద్యమ స్ఫూర్తితో ఎస్కే డే పంచాయతీరాజ్‌ను ప్రారంభించారో దాన్ని మనం ముందుకు తీసుకు పోవాలి. 60 శాతం జనాభా ఉన్న గ్రామీణ ప్రజలకు మీరు నాయకత్వం వహించాలి. గ్రామాలను పట్టుకొమ్మల్లాగా చేయడంలో నిమగ్నం కావాలి. అలా చేసి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. గొప్ప పేరు సంపాదించుకోండి. అందులో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. గ్రామీణ తెలంగాణను అన్ని రకాలా బాగు చేయడానికి మీ శక్తియుక్తులను ఉపయోగించండి.  

>
మరిన్ని వార్తలు