ముందస్తుకు వెళతాం

26 Aug, 2018 00:58 IST|Sakshi
శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలసి కరచాలనం చేస్తున్న సీఎం కేసీఆర్‌

ఈ మార్గంలో మాకున్న అడ్డంకులు తొలగించండి

ప్రధానితో భేటీలో కేసీఆర్‌

రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చ

కాంగ్రెస్‌ ఉమ్మడి శత్రువు

ఆ పార్టీని దెబ్బకొట్టేందుకు ముందస్తు ఎన్నికలే మార్గం

జోనల్‌పై తక్షణ ఆమోదం కావాలి

సానుకూలంగా స్పందించిన మోదీ!

హైకోర్టు విభజన, జిల్లాలకు నిధుల వంటి అంశాలపై విన్నపాలు

సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తాము రాజకీయంగా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీకి వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ మార్గంలో తమకు ఉన్న అడ్డంకులను తొలగించాలని సీఎం కోరినట్లు సమాచారం. ప్రధానంగా నూతన జోనల్‌ వ్యవస్థకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడని కారణంగా 10 వేల ఉద్యోగ నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ ప్రతిపాదన తక్షణం ఆమోదం పొందేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలియవచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్‌ శనివారం సాయంత్రం 4.05 గంటల నుంచి 4.25 గంటల వరకు ప్రధానితో సమావేశమయ్యారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ కూడా ఉన్నారు. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలతోపాటు పాలనాపరమైన అంశాలను చర్చించారు.

తొలుత పాలనాపరమైన అంశాలను ప్రస్తావించిన కేసీఆర్‌...ఆ తర్వాత రాజకీయపరమైన అంశాలపై ప్రధానితో ఏకాంతంగా చర్చించినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక పరిస్థితుల్లో శాసనసభకు గడువుకు ముందే ఎన్నికలు కోరుకుంటున్నట్లు చెప్పిన కేసీఆర్‌...సెప్టెంబర్‌లో శాసనసభను రద్దు చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫారసు చేయబోతునున్నామని ప్రధానికి చెప్పినట్లు సమాచారం. ఇందుకుగల కారణాలను ఆయన ప్రధానమంత్రికి వివరించినట్లు విశ్వసనీయవర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఉమ్మడి శత్రువని, ఆ పార్టీని దెబ్బకొట్టడానికి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడమే సరైన మార్గమని కేసీఆర్‌ వివరించినట్లు తెలియవచ్చింది. ఈ ఆలోచనకు ప్రధాని కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పాలనాపరమైన అంశాలపై ప్రధానికి సీఎం కేసీఆర్‌ విన్నపాలు ఇవీ... 

మార్గం సుగమం చేయండి... 
చాలా తక్కువ సమయంలోనైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఉద్యోగ నియామకాలకు సంబంధించి పలు నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రధాని వద్ద ప్రస్తావించారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రతిపాదించిన నూతన జోనల్‌ వ్యవస్థను ఆమోదిస్తూ ఆర్టికల్‌ 371–డీ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ జరగాల్సి ఉందని నివేదించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలన్న ప్రతిపాదనపై హోంశాఖ, న్యాయశాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం  తగిన వివరణ కూడా ఇచ్చిందని నివేదించారు. అయినప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వులపై సవరణ ఉత్తర్వులు వెలువడటంలో ఆలస్యమవుతోందని వివరించారు. వాటిని వెంటనే జారీ చేసేలా చూడాలని కోరారు. రెండు మూడు రోజుల్లోనే ఈ ఉత్తర్వులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. దీనిపై గత రెండు నెలల్లో మూడుసార్లు నివేదించినట్టు గుర్తుచేశారు. 

నాలుగో విడత నిధులు ఇవ్వండి... 
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల మేరకు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 450 కోట్ల చొప్పున మూడు విడతలుగా విడుదల చేశారని, నాలుగో విడత నిధులను విడుదల చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ ప్రధానికి గుర్తుచేశారు. వాటిని తక్షణం విడుదల చేయాలని కోరారు. అలాగే మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీలో కేంద్ర వాటాను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజనను సకాలంలో పూర్తిచేయాలని, రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు నిధులివ్వాలని, సచివాలయ నిర్మాణానికి రక్షణశాఖ భూములు ఇవ్వాలని కూడా కోరారు. 

ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపు ఈ ఏడాదికీ ఇవ్వండి... 
ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితి అయిన జీఎస్‌డీపీలో 3 శాతానికి అదనంగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు మరో అర శాతం సడలించేందుకు 14వ ఆర్థిక సంఘం అవకాశం కల్పించిన విషయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రధానికి గుర్తుచేశారు. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఆర్థిక సంఘం 3.5 శాతానికి సడలించిందని, 2017–18లో కూడా తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్నందున 2018–19కి సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సడలించాలని కేసీఆర్‌ విన్నవించారు. ఈ ఏడాది సాగునీరు, తాగునీటి పథకాలకు అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నామని, అందువల్ల మరిన్ని రుణాలు పొందాల్సి ఉందని సీఎం వివరించారు. 

ప్రతిపక్షాలు సర్దుకోక ముందే... 
ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం కాకముందే శాసనసభకు ఎన్నికలను తెచ్చిపెట్టాలనే వ్యూహంతో కేసీఆర్‌ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వంపైనే ఇంకా అయోమయం కొనసాగుతుండటం, కాంగ్రెస్, టీడీపీతోపాటు తెలంగాణ జన సమితి, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ వంటివి వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవచ్చుననే అంచనాలు సాగుతున్న నేపథ్యంలో అవన్నీ కొలిక్కి రాకముందే నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చేలా కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. శాసనసభకు, లోక్‌సభకు వేర్వేరుగా ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ లాభపడుతుందని, రెండింటికీ ఒకేసారి ఎన్నికలు రావడం వల్ల జాతీయ స్థాయిలో ఆశించిన ప్రచారం రావట్లేదని తన సన్నిహితుల వద్ద కేసీఆర్‌ గతంలో వ్యాఖ్యానించారు. 

2, 3 రోజుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు: ఎంపీ వినోద్‌ 
కొత్త జోనల్‌ వ్యవస్థపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అవుతాయని ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కొత్త జోనల్‌ వ్యవస్థను ఆమోదించాలని ప్రధానిని సీఎం కేసీఆర్‌ కోరారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలన్న ప్రతిపాదనకుగల హేతబద్ధతను వివరించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అవుతాయి. తెలంగాణ నిరుద్యోగ యువతకు గొప్ప విజయం ఇది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో పంచాయతీరాజ్‌ సెక్రటరీల నియామకానికి సంబంధించి 10 వేల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటిని జోనల్‌ విధానంలో భర్తీ చేయాల్సి ఉంది. త్వరగా ఉత్తర్వులు ఇప్పించాలని సీఎం కోరారు. దాని కోసమే ఈ పర్యటన. హైకోర్టు విభజనపైనా ప్రధాని భరోసా ఇచ్చారు. ఈ రెండూ గొప్ప విజయాలు’అని వినోద్‌ తెలిపారు.   

>
మరిన్ని వార్తలు