హైదరాబాద్‌ ప్రతిష్ట పెరిగింది

1 Dec, 2017 01:52 IST|Sakshi

జీఈఎస్, మెట్రో విజయవంతంపై సీఎం హర్షం

అధికారులు, పోలీసు శాఖకు ప్రత్యేక అభినందనలు

కేంద్ర హోంశాఖ, అమెరికా ఏజెన్సీల నుంచి పోలీసులకు ప్రశంసలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)తో అంతర్జాతీయంగా హైదరా బాద్‌ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. జీఈఎస్‌తోపాటు మెట్రోరైలు ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలు దిగ్వి జయం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అధికార యంత్రాం గానికి, పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పని చేసి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చిన కార్యక్రమాలను దిగ్విజయం చేశారని కొని యాడారు. భద్రతా ఏర్పాట్లు బాగున్నాయని పోలీస్‌ శాఖను ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల పనిని ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు సందేశం వచ్చిందని చెప్పారు. రాష్ట్ర పోలీసులకు అమెరికా సీక్రెట్‌ ఏజెన్సీ, కేంద్ర హోం శాఖ, నీతి ఆయోగ్, వివిధ దేశాల ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి.

ఇవాంకా పర్యటన అంతా రహస్యమే
ఇవాంకా పర్యటన షెడ్యూల్‌ను అమెరికా అధికారులు చాలా గోప్యంగా ఉంచారు. సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ఆమె కదలికలపై చివరి క్షణంలోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా ఆమె ప్రత్యేక విమానంలో వస్తారని చెప్పారు. చివరికి సాధారణ ప్యాసింజర్‌ విమానంలోనే వచ్చారు. వెస్టిన్‌ హోటల్లో బస చేస్తారని ముందు చెప్పారు. కానీ చివరికి ట్రైడెంట్‌కు మారింది. గోల్కొండ కోట సందర్శించే విషయాన్ని కూడా చివరి క్షణం దాకా గోప్యంగా ఉంచారు. అమెరికన్‌ సీక్రెట్‌ ఏజెన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా రాష్ట్ర పోలీసులు కూడా ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ రూపొందించుకుని సిద్ధంగా ఉన్నారు.  ఇవాంక పర్యటన ముగించుకుని వెళ్లిపోయే సందర్భంగా అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు డీజీపీ మహేందర్‌ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.


మహిళలను అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ 
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. గురువారం ఉదయం నీతి ఆయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఫిక్కీ, ఫిక్కీ ఫ్లో, ఇండియన్‌ స్కూల్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ ప్రాంగణంలో వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం జరిగింది.

జీఈఎస్‌ సదస్సులో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ  మహిళలు అన్ని రంగాల్లో విశేష ప్రతిభ చాటు తూ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీఎస్‌ఐపాస్, పారిశ్రామిక విధానం దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచనలో పడేస్తోందన్నారు. విదేశీయులు సైతం దీన్ని పరిశీలిస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. హైదరాబాద్‌ నగరం స్టార్టప్‌లకు నిలయం గా మారిందన్నారు.

కేటీఆర్‌కు వైట్‌హౌస్‌ నుంచి ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుకు అమెరికా అధ్యక్షుడి భవనం వైట్‌హౌస్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిందని జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఫిబ్రవరి 12న హార్వర్డ్‌ వర్సిటీ సందర్శనలో భాగంగా ఈ టూర్‌ ఉంటుందన్నారు. ఇవాంకా ట్రంప్‌ స్వయంగా కేటీఆర్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారన్నారు.


‘రోడ్‌ టూ గెస్‌’ పేరిట 50 సదస్సులు
నీతి ఆయోగ్‌ సలహాదారు అన్నారాయ్‌
హైదరాబాద్‌: జీఈఎస్‌ సదస్సు అనేది అమెరికా సహకారంతో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు. కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనలకు, స్టార్టప్‌లకు పూర్తి స్థాయి ప్రోత్సాహాన్ని ఇస్తుందని నీతి ఆయోగ్‌ సలహాదారు అన్నారాయ్‌ పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ‘రోడ్‌ టూ గెస్‌’పేరిట 50 సదస్సులను దేశవ్యాప్తంగా నిర్వహించామన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌ స్కిల్స్, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్, స్టార్టప్, ముద్రా, స్టాండప్‌ వంటి కార్యక్రమాల ద్వారా అన్ని రకాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి, స్టార్టప్‌ల రూపకల్పనకు ప్రోత్సహిస్తామన్నారు.

నీతి ఆయోగ్, ఫిక్కీతో కలసి పనిచేయడం ద్వారా స్టార్టప్‌లకు, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మరింతగా సహకరిస్తామన్నారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న ఫిక్కీ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌పర్సన్‌ కామిని సరాఫ్, సినీనటి మంచు లక్ష్మి, సైలవెంట్‌ అడ్వైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ ఆనంద సుదర్శన్, అపోలో ఆస్పత్రుల జేఎండీ డా. సంగీతారెడ్డి, ఐఎస్‌బీ ఐఈ సెంటర్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆనంద్‌ నందకుమార్, ఐఎస్‌బీ ప్రొఫెసర్‌ సమ్యా సింద్రాని, సైఫెర్‌ హెల్త్‌కేర్‌ ఎండీ సొనాలీ స్రుంగరామ్, ఫ్య్రాంకోఫెర్‌ ఇండియా హెడ్‌ ఆనంది అయ్యర్‌ ప్రసంగించారు.


మహిళా పారిశ్రామికవేత్తలను ఫిక్కీ ప్రోత్సహిస్తుంది
ఫిక్కీ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ బారువా
భారతీయ పారిశ్రామిక వేత్తలను ప్రత్యేకించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు ఫిక్కీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సంజయ్‌ బారువా పేర్కొన్నారు. డీఎస్‌టీ లాక్‌షెడ్‌ మార్టిన్‌ ఇండియా ఇన్నోవేషన్‌ గ్రోత్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వ్యవస్థాపకులకు అవసరమైన కల్పన, వ్యాపారాభివృద్ధి మద్దతుతో 800 మిలియన్‌ డాలర్ల సంపదను సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు 500 మంది వ్యవస్థాపకులకు మద్దతు అందిందన్నారు. ఏపీ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్, ఫిక్కీ భాగస్వామ్యంతో తిరుపతిలో ప్రపంచ స్థాయి ఇంక్యుబేటర్‌ స్థాపనకు ఒప్పందం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 85కు పైగా ఇంక్యుబేటర్లు ప్రారంభించేందుకు తోడ్పాటు ఇచ్చామన్నారు. ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓను ఫిక్కీ విమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆర్గనైజేషన్‌గా మార్చాలని బావిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు