‘పాలమూరు’కు ఏం ఒరగబెట్టారు?

30 Mar, 2019 12:32 IST|Sakshi
మోదీ సమక్షంలో బీజేపీలో చేరుతున్న మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌

మహబూబ్‌నగర్‌ ఎంపీగా కేసీఆర్‌ను ఆదరిస్తే.. అభివృద్ధిని విస్మరించారు.. 

సైనిక్‌ స్కూల్‌ మంజూరు చేసినా పట్టించుకోలేదు 

కేంద్రం నిధులతోనే సికింద్రాబాద్‌ – పాలమూరు డబ్లింగ్‌ రైల్వేలైన్‌ పనులు  

విజయసంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ   

సాక్షి, మహబూబ్‌నగర్‌:  పాలమూరు అభివృద్ధిని విస్మరించిన సీఎం కేసీఆర్‌ జిల్లాను దుర్గతి పట్టించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. 2009లో ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన కేసీఆర్‌ స్వరాష్ట్రంలో నాలుగున్నరేళ్లు సీఎంగా పనిచేశారన్నారు. అయినా ఈ ప్రాంత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టిసారించలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక బాగుపడింది కేసీఆర్‌ కుటుంబమేనని.. తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఇక్కడి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు. పాలమూరును నిర్లక్ష్యం చేసిన వాళ్లు ఒకవైపు ఉంటే.. పాలమూరు ప్రజల పక్షాన నిలిచిన మేం మరోవైపు ఉన్నామని, ఎవరు కావాలో నిర్ణయం తీసుకోవాల్సింది మీరే అని ప్రజలనుద్దేశించి చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌కు విచ్చేసిన ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. జిల్లాకు సైనిక్‌ స్కూలు మంజూరు చేసినా.. ఆ ఫైల్‌ను తొక్కిపెట్టారన్నారు. ప్రస్తుతం సికిందరాబాద్‌– పాలమూరు డబ్లింగ్‌ రైల్వేలైన్, జడ్చర్ల నుంచి రాయిచూర్‌ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేసే కృతనిశ్చయంతో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పేర్లు మార్చి వాటిని కేసీఆర్‌ తన పథకాలుగా చెప్పుకుంటూ అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, ఉచితంగా రూ.5 లక్షల విలువ చేసే కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంటే.. దాన్ని కేసీఆర్‌ అడ్డుకున్నారని మండిపడ్డారు. 

తన ప్రసంగానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. జిల్లాకు చెందిన సురవరం ప్రతాప్‌రెడ్డి, గడియారం రామకృష్ణశర్మ, కపిలవాయి లింగమూర్తిలను తలచుకున్నారు. తమ కవితలతో సమాజానికి దారి చూపిన మహానీయులుగా వారిని కొనియాడారు. అలాగే ఎంపీ జితేందర్‌రెడ్డిని తన చిరకాల మిత్రుడిగా అభివర్ణించిన పీఎం.. ఈ సభలో ఆయన తనతో ఉండడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బహిరంగ సభలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ కోశాధికారి శాంతికుమార్, కార్యవర్గ సభ్యులు కొండయ్య, పాండురంగారెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, బాలరాజు, నాయకులు నాగూరావు నామాజీ, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం: జితేందర్‌
నవ భారత నిర్మాణం, అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌వి వారసత్వ రాజకీయాలుగా చెప్పిన మోదీ బీజేపీలో పనిచేసే వారికే గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందన్నారు. దేశం, రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంలో బీజేపీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ తనను డ్రాప్‌ చేస్తే నరేంద్రమోదీ ఎత్తుకున్నారన్నారు. పాలమూరు అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ వివక్ష చూపారన్నారు. 

నిరంకుశ పాలన అంతానికే..: డీకే అరుణ
రాష్ట్రంలో కొనసాగుతోన్న టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలన అంతం కోసమే బీజేపీలో చేరానని మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని గొప్పలు చెబుతున్న కేసీఆర్‌.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు గడ్డ మీద పుట్టి.. పెరిగిన నాకు ఎంపీ టిక్కెట్‌ ఇచ్చిన నరేంద్రమోదీకి నా గెలుపును కానుకగా ఇస్తానన్నారు. దేశానికి మోదీ నాయకత్వం అవసరం ఎంతో ఉందన్నారు. 

నమ్మకాన్ని వమ్ము చేయను: శ్రుతి
దళిత మహిళ అయిన నాపై ఎంతో నమ్మకం ఉంచి పార్టీ నుంచి నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రుణపడి ఉంటానని ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి అన్నారు. నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటానన్నారు. ఎంపీగా గెలిచి తమ తండ్రి కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్‌ ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు. ప్రచారానికి వెళ్తున్న నన్ను ఆదరిస్తున్న ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నానన్నారు.   

మరిన్ని వార్తలు