వీఆర్‌వో వ్యవస్థ రద్దు?

22 Aug, 2019 02:32 IST|Sakshi

సర్వేయర్లు కూడా ఔట్‌.. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు బాధ్యతలు 

వీఆర్‌వోలను ఇతర శాఖలకు బదలాయింపు 

రెవెన్యూ శాఖ సమగ్ర మార్పునకు త్వరలో శ్రీకారం 

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ వ్యవస్థను సమగ్రంగా మార్చాలన్న యోచనలో ఉన్న సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు. సత్వర సేవలు, అవినీతి నియంత్రణ లక్ష్యంతో ఈ వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో) వ్యవస్థ రద్దు, క్వాలిఫైడ్‌ వీఆర్‌వోలను జూనియర్‌ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ రెవెన్యూ శాఖలో కొనసాగించే అంశాన్ని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. కొత్త చట్టంలో పొందుపరిచే అంశాలపై చర్చించడమే కాకుండా.. కలెక్టర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చివరకు వీఆర్‌వో వ్యవస్థ రద్దు మంచిదనే భావనలో సీఎం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

వారి వల్లే చెడ్డపేరు 
భూ రికార్డుల ప్రక్షాళనలో వీఆర్‌వోల భాగ స్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వ హణ నుంచి వారిని తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున.. వీరి అవసరం లేదనే అంచనాకొచి్చంది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ రికార్డులను సవరించే క్రమంలో వీఆర్‌వోల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తే ఉద్యోగవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న సర్కారు.. వీరి సేవలను వేరే విధంగా వాడుకోవాలని భావిస్తోంది. విద్యార్హతలు, నైపుణ్యం, నిబద్ధత ఉన్న వారినే రెవెన్యూలో కొనసాగించి.. మిగిలిన వారిని పూలింగ్‌లో పెట్టడం ద్వారా వేరే శాఖ (పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ)ల్లోకి బదిలీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. వీఆర్‌ఏలను పంచాయతీరాజ్‌ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 

సర్వే ప్రైవేటుపరం!: సర్వేయర్ల వ్యవస్థ రద్దునూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెవెన్యూ లో అవినీతికి సర్వేయర్లు ప్రధాన కారణమని అంచనాకు వచ్చిన సర్కారు.. వీరిపై వేటు వేసేలా ఆలోచన చేస్తోంది. సర్వేను ప్రైవేటు పరంచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాధ్యతలను లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు అప్పగించనుంది.

ఒకే రోజులో మ్యూటేషన్‌! 
భూముల మ్యూటేషన్‌ను సరళతరం చేయనుంది. రిజి్రస్టేషన్‌ అయిన రోజే మ్యూటేషన్‌ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. 24 గంటల్లో అభ్యంతరాలు రాకపోతే.. తహసీల్దార్‌ మ్యూటేషన్‌ ప్రోసీడింగ్స్‌ (ఆటోమేటిక్‌ డిజిటల్‌ సంతకం జరిగేలా) ఇవ్వడమే కాకుండా.. ఆన్‌లైన్‌ పహాణీలో నమోదు చేసేలా చట్టంలో పొందుపరచనున్నారు. అలాగే 10 రోజుల్లో పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని నేరుగా రైతు ఇంటికే పంపనున్నారు.

సమగ్ర సర్వేకు మొగ్గు: భూరికార్డుల ప్రక్షాళనను సంపూర్ణం చేసేందుకు సమగ్ర భూసర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. టైటిల్‌ గ్యారంటీ అమలుకు ఈ సర్వే అనివార్యమైనందున భూసమగ్ర సర్వేకు ఆదేశాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. టైటిల్‌ గ్యారెంటీ చట్టం అమల్లోకి తేవడానికి ముందు సరిహద్దు వివాదాలు, క్లియర్‌ టైటిల్‌ ఉండాలనే కారణాలతోనే సమగ్ర భూసర్వే నిర్వహించనుంది. ఏపీలో ఉన్న టైటిల్‌ గ్యారంటీ చట్టం పేరు మారి వేరే చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. 

తహసీల్దార్ల అధికారాలకు కోత?
తహసీల్దార్ల అధికారాల కుదింపుపై కలెక్టర్ల భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమై నట్లు తెలుస్తోంది. మ్యూటేషన్లతోపాటు భూరికార్డుల మార్పులు, చేర్పుల అధికారాన్ని జాయింట్‌ కలెక్టర్లకు బదలాయిస్తే కొత్త సమస్యలు వస్తాయని కొందరు కలెక్టర్లు సూచించినట్లు సమాచారం. ప్రస్తుత విధానమే మంచిదనే వాదనలు వినిపించినట్లు తెలిసింది. వీరి అధికారాలపై రెవెన్యూ ముసాయిదాలో స్పష్టత రానుంది. 

మరిన్ని వార్తలు