రాజకీయ లబ్ధికే ‘విమోచన’ విస్మరణ

7 Sep, 2017 02:23 IST|Sakshi
రాజకీయ లబ్ధికే ‘విమోచన’ విస్మరణ

సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ ధ్వజం

మేడ్చల్‌/ మేడ్చల్‌ రూరల్‌/మహేశ్వరం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ ప్రయోజనాల కోసమే సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలేదని కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి ధ్వజమెత్తారు. బీజేపీ చేపట్టిన విమోచన యాత్ర బుధవారం మేడ్చల్, మహేశ్వరం చేరింది. ఈ సందర్భంగా జరిగిన ఆయా సభల్లో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారం లోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. గత కాంగ్రెస్‌ పాలనలో దేశంలో అవినీతి పేరుకుపోయిందని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వెలికి తీసేందుకు పెద్దనోట్లను రద్దు చేశారని అన్నారు. యూపీలో మాదిరిగా తెలంగాణ ప్రజలు సైతం పరివర్తనం చెంది రాష్ట్రంలో బీజేపీకి అధికారం కట్టబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

త్యాగాలతో సాధించిన తెలంగాణ చరిత్రను సీఎం కేసీఆర్‌ కొంత మంది చేతిలో కీలుబొమ్మగా మారి తన స్వార్థం కోసం చరిత్రను వక్రీకరిస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. విమోచ నపై ఉద్యమ సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట కేసీఆర్‌ మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మజ్లిస్‌పార్టీ చేతిలో టీఆర్‌ఎస్‌ కీలుబొమ్మగా మారి రజాకార్ల పాలన సాగిస్తోందని ఆరోపించారు. రైతు సమన్వయ సమితుల పేరుతో టీఆర్‌ఎస్‌ శ్రేణులను సభ్యులుగా చేసి వాటిని ఆ పార్టీ కమిటీలుగా మారుస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన, మూడేళ్ల మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చ కు రావాలని ఉత్తమ్‌కు సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు