‘సర్వే’యర్ల కొరత !

1 Aug, 2014 23:32 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇంటింటి సర్వే’ జిల్లా యంత్రాంగానికి కత్తిమీదసాములా మారింది. ఈ నెల 19న ఒకేరోజు సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో ఉద్యోగులను సమకూర్చుకోవడం అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. జిల్లాలో 13 లక్షల ఇళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు 54వేల మంది సిబ్బంది అవసరమని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు 30వేల మంది ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు వీరందరినీ పోలింగ్ విధులకు వినియోగించుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సంఖ్యకంటే అదనంగా మరో 14వేల మంది అవసరం కానుండడంతో ఏంచేయాలో అధికారగణానికి పాలుపోవడంలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం కేసీఆర్ ఆయా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ‘సమగ్ర సర్వే’ నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
 
ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను కలెక్టర్ ఎన్.శ్రీధర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, సర్వేకు సరిపడా ఉద్యోగులు లేనందున.. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలోనే ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సర్వే విధానంపై విడిగా సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.
 
పక్కాగా ‘స్థానికత’
సమగ్ర సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ‘ఫాస్ట్’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసినందున.. స్థానికత ధ్రువీకరణ పత్రాల మంజూరులో అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు చెప్పారు. సేకరించిన సర్వే వివరాలను రెండు వారాల్లో కంప్యూటరీకరించాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. సమగ్ర సర్వేకు 54వేల మంది సిబ్బంది అవసరమని, ఆ మేరకు సమీకరించుకునేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలని సీఎం చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు