తక్షణమే రైతుబంధు : కేసీఆర్‌

16 Jun, 2020 03:45 IST|Sakshi

వారం రోజుల్లో రైతులందరి ఖాతాల్లో జమ

ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా చెల్లించాలి..

వ్యవసాయంపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

అన్నదాతలు 100% నియంత్రిత సాగుకు సిద్ధం కావడంపై హర్షం

కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా రైతుబంధు అందిస్తున్నట్లు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమైనందున రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదన్నారు. ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. ‘ఏడాదికి ఒక ఎకరానికి 10 వేల చొప్పున సాయం అందించాలన్నది ప్రభుత్వ విధానం. వర్షాకాలంలో రూ. 5 వేలు, యాసంగిలో రూ. 5 వేలు ఇస్తున్నాం.

ఈ వర్షాకాలంలో రైతులందరికీ ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఇవ్వడానికి మొత్తం రూ. 7 వేల కోట్లు కావాలి. ఇప్పటికే రూ. 5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో రూ.1,500 కోట్లను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాం’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు అందించే రైతుబంధు సొమ్ము మాత్రం తప్పక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడంపట్ల కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అభినందనులు తెలిపిన కేసీఆర్‌... రైతుబంధు డబ్బులను కూడా ఉపయోగించుకొని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే...

నియంత్రిత సాగు.. ఒక పంట కోసమో లేక ఒక సీజన్‌ కోసమో ఉద్దేశించినది కాదు. రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం చోటుచేసుకుం టున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సే కేంద్ర బిందువుగా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానం రూపొందించాం. రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటీ 30లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తోంది. నియంత్రిత సాగుతో ఉజ్వల ప్రస్థానానికి తెలంగాణ నాంది పలుకుతుంది. 

లాభసాటి సాగే ప్రభుత్వ లక్ష్యం..
మార్కెట్లో డిమాండ్‌గల పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించింది. దీనికి రైతుల నుంచి వంద శాతం మద్దతు లభించింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం సూచించిన పంటల సాగే జరుగుతున్నట్లు తేలింది. ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవడానికి అనుగుణంగానే రైతులు విత్తనాలను కొనుగోలు చేశారు. ఈ వర్షాకాంలో 41,76,778 ఎకరాల్లో వరి, 12,31,284 ఎకరాల్లో కందులు, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్, 60,16,079 ఎకరాల్లో పత్తి, 1,53,565 ఎకరాల్లో జొన్నలు, 1,88,466 ఎకరాల్లో పెసర్లు, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండించనున్నారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలసాగు విధానం అమలు చేయడానికి సిద్ధం కావడం హర్షణీయం.

రైతుల స్పందన అద్భుతం.. గొప్ప ముందడుగు
తెలంగాణ సమాజం పరిణామశీలమైనది. రాష్ట్రంలో చైతన్యవంతమైన రైతాంగం ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక దేశంలోనే గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా మారింది. భవిష్యత్తులో వ్వయసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. వ్యవసాయ రంగం సుస్థిరంగా నిలబడాలని, వ్యవస్థీకృతం కావాలని, రైతులకు స్థిరమైన ఆదాయం రావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకోసమే నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేసుకోవాలని కోరింది. దానికి రాష్ట్ర రైతాంగం అద్భుతంగా స్పందించింది. ఇది గొప్ప ముందడుగు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేయడానికి, దేశానికి ఆదర్శంగా నిలవడానికి అమలు చేస్తున్న నియంత్రిత పద్ధతిలో పంటలసాగు వైపు మన రైతులు గొప్పగా తొలి అడుగు వేశారు.

యాసంగిలో 45 లక్షల ఎకరాల్లో వరి ..
ఈ వర్షాకాలంలో నియంత్రిత పంటల సాగు విధానానికి విజయవంతంగా తొలి అడుగు పడింది. ఇదే స్పూర్తితో యాసంగి వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి. యాసంగిలో ఏ పంటలు సాగు చేయాలో రైతులకు మార్గదర్శకం చేయడంతోపాటు ఆ పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో ఉండేట్లు చూడాలి. గత యాసంగిలో 53.5 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఈసారి ప్రాజెక్టుల ద్వారా వచ్చే సాగునీటితోపాటు మంచి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున మరో 10–12 లక్షల ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో వద్దని చెప్పిన మక్కలు యాసంగిలో సాగు చేసుకోవాలి. 45 లక్షల ఎకరాల్లో వరి, 6–7 లక్షల ఎకరాల్లో మక్కలు, 4 లక్షల ఎకరాల్లో శనగలు, 5 లక్షల ఎకరాల్లో వేరుశనగ (పల్లి), లక్షన్నర ఎకరాల్లో కూరగాయలు సాగు చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. దీనికి సంబంధించిన విత్తనాలను కూడా అందుబాటులోకి తేవాలి. వరిలో సన్న, దొడ్డు రకాలను కూడా రైతులకు సూచించాలి. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతాయి. వేరుశనగ, శనగ విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేయాలి. 

పంజాబ్‌ నేర్పిన పాఠం..
గతంలో పంజాబ్‌ వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. అయితే పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడం వల్ల పంజాబ్‌లో వ్యవసాయ వైపరీత్యం సంభవించింది. పంజాబ్‌ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సమస్యలేవీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఉండేందుకు నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసింది.

ఎరువుల వాడకంపై ...
వేసిన ఎరువంతా వినియోగం కాక భూమిలోనే చాలా పాస్ఫేట్‌ (బాస్వరం) నిల్వలు పేరుకుపోతున్నాయి. పేరుకుపోయిన బాస్వరాన్ని తొలగించడానికి పాస్ఫేట్‌ సాల్యబుల్‌ బ్యాక్టీరియాను వదలడం ద్వారా భూ సారాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుంది. ఇలాంటి విధానాలను కూడా నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. పంటల మార్పిడి, ఎరువుల వాడకంతోపాటు మార్కెట్లోకి క్రమ పద్ధతిలో సరుకును తేవడం, భూసారాన్ని రక్షించడం, మార్కెట్‌ పరిస్థితులపై విశ్లేషణ, పరిశోదన కూడా నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఉంటాయి.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ దిశగా...
రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన ఇతర వ్యవస్థలు కూడా వృద్ధి చెందాలి. మిల్లింగ్‌ వ్యవస్థ పెరగాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జరగాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

సీఎం చెప్పిన బహుళ ప్రయోజనాలివీ...

  • నియంత్రిత సాగు వల్ల మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే రైతులు పండిస్తారు. దీనివల్ల కొనుగోలు, మద్దతు ధర సమస్య తలెత్తదు.
  • పంటల మార్పిడి వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది.
  • ఒకే రకం పంట వేయడం వల్ల, ఆ ధాన్యానికి అలవాటైన బ్యాక్టీరియా ఆ పొలాల్లోనే తిష్టవేస్తుంది. చీడ పీడలకు, తెగుళ్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. పంటల మార్పిడి వల్ల బ్యాక్టీరియా పంటలపై తిష్టవేసే ప్రమాదం ఉండదు.
  • నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండి, మురుగునీటి సమస్య తలెత్తే ప్రమాదం తప్పుతుంది.
  • భూమిలో లవణీయత పెరిగి చవుడు బారిపోయే ప్రమాదం ఉండదు. 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు