ఎత్తిపోతలకు సిద్ధం కండి

28 Jul, 2019 01:07 IST|Sakshi

ఎగువ వర్షాలతో కృష్ణానదికి పెరుగుతున్న వరద 

వారం, పదిరోజుల్లో జూరాలకు కృష్ణాజలాలు 

జూరాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నింపే ఏర్పాట్లకు సీఎం ఆదేశం 

నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పంపుల నిర్వహణకు నిధులు 

సాగుకు నీరివ్వడంతోపాటు చెరువులు నింపడంపై ప్రత్యేక దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌ : మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, మహాబలేశ్వర్‌లో ఒక్క రోజులోనే 24 సెంటీమీటర్ల వర్షం కురవడంతో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు జలకళ పెరుగుతోంది. ఇప్పటికే ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు నిండుకోవడం.. మరో నాలుగైదు టీఎంసీల నీరు ప్రాజెక్టులకు చేరితే ఆపై వచ్చే నీరంతా దిగువకు విడుదల చేసే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో వారం, పది రోజుల్లోనే జూరాలకు ప్రవాహాలు కొనసాగే అవకాశాల నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోసేందుకు అంతా సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లను సీఎం కేసీఆర్‌ శనివారం ఆదేశించారు. ముఖ్యంగా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పంపులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించిన సీఎం వాటి ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం) నిధుల విడుదలకు ఓకే చెప్పారు. 

నిండుకుండలా ఆల్మట్టి  
ఇప్పటికే కురిసిన వర్షాలతో ఆల్మట్టి పూర్తిగా నిండింది. నిన్నమొన్నటి వరకు ప్రాజెక్టులోకి ప్రవాహాలు తగ్గి 11వేల క్యూసెక్కుల మేర వరద పోటెత్తగా.. అది శనివారం ఉదయానికి 22,593 క్యూసెక్కులకు, సాయంత్రానికి 25వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్ధ్యం 129 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 124.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని జలాశయాన్ని పూర్తిగా నింపకుండా కొంత ఖాళీగా ఉంచనున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 3,045 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు.

దీంతో నారాయణపూర్‌లో నిల్వ 37 టీఎంసీలకు గానూ 31 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 3,628 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 7,537 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాలకై కాల్వలకు వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ మహాబలేశ్వర్, పశ్చిమకనుమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి లక్ష క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పైనున్న ప్రాజెక్టులు నిండిన నేపథ్యంలో.. నీటిని దిగువకు విడుదల చేయక తప్పనిసరి స్థితి ఏర్పడుతుంది. వరద ఉధృతిని బట్టి రెండు, మూడు రోజుల్లోనే ఆల్మట్టి గేట్లు ఎత్తే అవకాశం ఉందని, నారాయణపూర్‌ నుంచి కాల్వలకు నీటి విడుదల జరిగినా, వారం, పది రోజుల్లో ఆ నీరు దిగువ జూరాలకు చేరుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. 
 
వచ్చింది వచ్చినట్లే ఎత్తిపోత 
ఇక జూరాలకు వరద ప్రవాహం మొదలైన వెంటనే నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టుల పంపుల ద్వారా నీటి ఎత్తిపోత మొదలెట్టాలని, వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోసేలా కార్యాచరణకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంపులను సిద్ధం చేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. గతేడాది జూరాల కుడి, ఎడమ కాల్వల కింద ఉన్న లక్ష ఎకరాలకు 23 టీఎంసీల నీటి వినియోగించారు. ఈ నీటితో 149 చెరువులను సైతం నింపారు. ఈ ఏడాది లక్ష ఎకరాలకు నీరిచ్చేలా ఇప్పటికే అంతా సిద్ధం చేశారు. బీమాలోని రెండు స్టేజ్‌ల లిఫ్టు వ్యవస్థల ద్వారా గతేడాది 12 టీఎంసీల నీటిని వినియోగించి 1.2లక్షల ఎకరాలకు నీరందించగా, ఈ ఏడాది 1.70లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రెడీ అయింది. దీని ద్వారా కనీసంగా 180 చెరువులను నింపాలని భావిస్తున్నారు.

ఇక నెట్టెంపాడు కింద 2లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా గతేడాది 7 టీఎంసీల నీటితో 80వేల ఎకరాలకు నీరందించగా, ఈ ఏడాది ఎత్తిపోసే నీటిని బట్టి 1.5లక్షల ఎకరాలకు నీరివ్వాలని, వందకు పైగా చెరువులు నింపాలని నిర్ణయించారు. ఇక కోయిల్‌సాగర్‌ ద్వారా సైతం 33వేల ఎకరాలకు నీరిచ్చేలా పంపులను తిప్పేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రాజెక్టు పంపుల నిర్వహణ (ఓఅండ్‌ఎం)కు నిధుల అవసరం ఉండటంతో ఇంజనీర్లు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో బీమా మొదటి లిఫ్ట్‌కి రూ.3.40కోట్లు, లిఫ్టు–2కి రూ.4.66కోట్లు, నెట్టెంపాడుకు రూ.4.98కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.2.34కోట్లకు సీఎం ఆమోదముద్ర లభించింది. వీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల ఓఅండ్‌ఎం కోసం రూ.6.30కోట్లకు ఆమోదం తెలిపారు. ఈ నిధులతో పంపులు, మోటార్లకు గ్రీజింగ్, ఆయిలింగ్, విద్యుత్‌ జనరేటర్లు ఏర్పాట్లు చేసుకోనున్నారు. కనిష్టంగా 50 టీఎంసీలు, గరిష్టంగా 70 టీఎంసీల నీటిని జూరాల, దానిపై ఆధారపడిన ప్రాజెక్టుల ద్వారా పంపింగ్‌ చేసి నీటి సరఫరా చేసేలా ఇంజనీర్లు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు