హోటళ్లు, రెస్టారెంట్లు తెరవాలి

26 Mar, 2020 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా నివారణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు/రెస్టారెంట్లు మూతపడి ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త. అన్ని హోటళ్లు/రెస్టారెంట్లను టేక్‌ అవే(పార్శిల్‌ను ఇంటికి తీసుకెళ్లడం), హోం డెలివరీ సేవలకు తెరిచి ఉంచాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆదేశించారు. అయితే వినియోగదారులు అక్కడే కూర్చొని తినడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ భోజన కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై మంగళవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలు సూచనలు చేశారని, వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లు/రెస్టారెంట్లు, ఇతర నిత్యావసర సరుకుల దుకాణాలను సాయంత్రం 6.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించారు. 

ఆహారపదార్థాలు, కిరాణా సరుకులు, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపల విక్రయాలు, నిల్వ, రవాణాను అనుమతించాలి. 
అన్ని రకాల దుకాణాలను సాయంత్రం 6.30 గంటలకు మూసేయాలి. 
నిరాశ్రయులను నైట్‌ షెల్టర్‌ హోంలకు తరలించి బాగోగులు చూడాలని కోరారు. 
రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాల నిర్వహణ కొనసాగించాలి. ఈ సమయంలో ఇవి అత్యవసరం.  
పురపాలికల్లో కంట్రోల్‌ రూమ్స్‌ తెరవాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలి. 
పారిశుధ్యం, నీటి సరఫరా, మురుగునీటి సరఫరా నిర్వహణ వంటి అత్యవసర పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. 
ఇంటింటి నుంచి చెత్త సేకరణ, రవాణాను పకడ్బందీగా నిర్వహించాలి. 
బయోమెట్రిక్‌ పద్ధతిలో హాజరు నమోదుకు ముందు, తర్వాత అధికారులందరూ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. 
పార్కులు, ఇతర ప్రజలు గుమికూడే ప్రదేశాలను మూసేయాలి. 
బహిరంగ ప్రదేశాల్లో ప్రజల మధ్య 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. 
లాక్‌డౌన్‌ సమయంలో దుకాణాల వద్ద సామాజిక దూరం నిబంధనను ఉల్లంఘించే వ్యక్తులపై ఐపీసీ 188, 269, 270 సెక్షన్ల కింద కేసులు పెట్టాలి. 
నిత్యావసరం కాని సరుకులు, అత్యవసరం కాని సేవలన్నింటినీ మూసేయాలి. 
బహిరంగ ప్రదేశాల్లో ఇన్‌ఫెక్షన్ల నివారిణి ద్రావణాన్ని చల్లాలి. రహదారుల మరమ్మతులు/నిర్వహణ పనులు వేగవంతం చేయాలి. 
ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందకుండా మున్సిపల్‌ కమిషనర్లు ఎవరూ సెలవులు పెట్టరాదు. విధులకు గైర్హాజరు కారాదు. 

ఉత్తమ పారిశుధ్య సేవలకు పురస్కారాలు
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్య నిర్వహణ కోసం అద్భుత సేవలందించిన 25 మంది మున్సిపల్‌ కమిషనర్లతో పాటు ప్రతి పురపాలికలోని ముగ్గురు పారిశుధ్య కార్మికులను గుర్తించి వారి పురస్కారాలను అందించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఏప్రిల్‌ 20 తర్వాత వీరికి పురస్కారాలు అందించనుంది. పట్టణ ప్రగతి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న రోజువారీ పారిశుధ్య కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పురస్కారాలకు ఎంపిక చేయనున్నారు.  

>
మరిన్ని వార్తలు