ఎస్సారెస్పీ ‘పునరుజ్జీవం’ 

27 Dec, 2018 01:36 IST|Sakshi

జూన్‌ నాటికే కాళేశ్వరంతోపాటు దీనిని పూర్తి చేసేలా సీఎం ఆదేశాలు 

త్వరలో ప్రాజెక్టు పరిధిలో పర్యటన..  

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఊపిరిలూదేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని కాళేశ్వరంతో పాటే ఈ జూన్‌ నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్‌ నుంచే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనులు జరుగుతున్న నేపథ్యంలో అదే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పూర్తి చేసి కనిష్టంగా 30 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తోంది. జూన్‌లో ఆయకట్టుకు నీటిని అందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం పనులను వేగిరం చేశారు. 2017 ఆగస్టు నెలలో ఆరంభించగా మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో ఇప్పటికే 30.98 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపనిలో 29.60 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని పూర్తయింది.

పంప్‌హౌస్‌ల్లో కాంక్రీట్‌ పనులు మాత్రం నెమ్మదిగా కొనసాగుతున్నాయి. 5.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనిలో కేవలం 3.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే పూర్తయింది. మరో 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని మిగిలి ఉంది. ఈ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సంబంధిత ఏజెన్సీపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటీవలే 200 మంది కార్మికులను అదనంగా నియమించి ఈ పనుల్లో వేగం పెంచారు. ఇక ఈ పథకానికి సంబంధించి మూడు పంప్‌హౌస్‌ల వద్ద ఎనిమిదేసి చొప్పున మొత్తంగా 24 మోటార్లు 1,450 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నవి అవసరం కానున్నాయి. మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో 24 పంపులకు గానూ 15 పంపులు, 24 మోటార్లకు గానూ 10 మోటార్లు మాత్రమే కొనుగోలు చేశారు.  

రోజుకు ఒక టీఎంసీ.. 
వచ్చే మే నాటికి 2 పంప్‌హౌస్‌లలో పూర్తిగా ఎనిమిదేసి మోటార్లను అమర్చి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రచించారు. ప్రస్తుతం 10 మోటార్లే ఉండగా వచ్చే జనవరి చివరికి మరో 6 పంపులు విదేశాల నుంచి రానున్నాయి. ప్రాజెక్టుకు 60 రోజుల్లో 60 టీఎంసీలు తీసుకునేలా రూపొందించగా, అందుకనుగుణంగా కనిష్టంగా 50 టీఎంసీల నీటినైనా ఎత్తిపోసే వ్యూహంతో పనులు చేస్తున్నారు. అనుకున్న మేర నీటిని ఎత్తిపోసినా ఐదు లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీటిని అందించే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలలో పనులన్నీ పూర్తి చేసి జూన్‌ నుంచే ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి 50 టీఎంసీల గోదావరి జలాలను తరలించడం లక్ష్యంగానే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని ఈఎన్‌సీ అనిల్‌ కుమార్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు